Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు చిన్నారుల మృతి
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో వున్న ఒక శిశు సంరక్షణా కేంద్రం (డే కేర్ సెంటర్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర పెన్సిల్వేనియాలోని ఎరీ పట్టణంలో వున్న ఈ డేకేర్ సెంటర్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎరీ అగ్నిమాపక విభాగం అధికారి గై శాంటోన్ చెప్పారు. ఒక కుటుంబానికి చెందిన ఈ మూడంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్లో ఎనిమిది మంది చిన్నారులున్నారని అధికారులు చెప్పారు. మృతులందరూ ఎనిమిది నెలల నుండి ఏడేళ్లలోపు వయస్సు వారేనని శాంటోన్ వివరించారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమానితో పాటు చిన్నారులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నంలో పొరుగింటికి చెందిన మరో వ్యక్తి కూడా గాయపడ్డారని చెప్పారు. మృతులలో నలుగురు ఒకే తల్లి సంతానమని, ఆమె నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తుందని వివరించారు. ఈ ప్రమాదంలో ఇంటి యజమానికి చెందిన చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయిందన్నారు. ప్రమాదకారణంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. దీని నిర్వహణకు వచ్చే ఏడాది మార్చి చివరి వరకూ అధికారులు అనుమతించారని తెలుస్తోంది.