Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష నేత జెరిమి కార్బిన్‌తో భేటీకి టోరీ రెబల్ ఎంపీల సంసిద్ధత
లండన్: నోడీల్ బ్రెగ్జిట్‌పై ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్‌తో చర్చించేందుకు అధికార టోరీ రెబల్ ఎంపీలు సంసిద్ధత వ్యక్తం చేశారు. బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31లోగా ఈయూతో ఎటువంటి ఒప్పందమూ కుదరకపోతే నోడీల్ బ్రెగ్జిట్‌కు సిద్ధమవుతున్న ప్రధాని జాన్సన్ యత్నాలకు అడ్డుకట్ట వేసే అంశంపై చర్చించేందుకు వారు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి ప్రాధాన్యతల ప్రాతిపదికన నోడీల్ బ్రెగ్జిట్‌కు అడ్డుకట్టవేసేందుకు పార్లమెంట్లో కలిసి పనిచేసే అంశంపై ప్రతిపక్షంతో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామని టోరీ ఎంపీలు డొమినక్ గ్రీవ్, కరోలిన్ స్పెల్మన్, ఆలివర్ లెట్విన్, మాజీ కన్జర్వేటివ్ ఎంపీ నిక్ బోల్స్ ఒక లేఖలో పేర్కొన్నారు. నోడీల్ బ్రెగ్జిట్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయితే ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి జెరిమీ కార్బిన్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను లిబరల్ డెమొక్రాటిక్, లేబర్ పార్టీ ఇప్పటికే తోసిపుచ్చాయి. కాగా టోరీ రెబల్ ఎంపిలు తాజాగా చేసిన ప్రతిపాదన ఇందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. తాత్కాలిక ప్రభుత్వంపై ఏకాభిప్రాయాన్ని నిర్మించే సామర్ధ్యం లేబర్ పార్టీకి లేదని స్విన్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా టోరీ రెబల్ ఎంపీలకు గ్రీన్ పార్టీ ఎస్ఎన్పీ ఎంపీ ప్లెయిడ్ సిమ్రు, గ్రీన్ పార్టీ ఎంపిలు కూడా కార్బిన్‌తో భేటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తుండటం గమనార్హం.