Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు పోలీస్ అధికారులకు గాయాలు, నిందితుడి అరెస్ట్
వాషింగ్టన్ : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. పోలీస్ కమిషనర్ రిచర్డ్ రాస్ తెలిపిన వివరాల ప్రకారం...ఫిలడెల్ఫియా నగరంలో పోలీస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు మెరుపుదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. నిందితుడు మరో ఇద్దరు పోలీస్ అధికారులను, ముగ్గురు పౌరులను బందీలుగా మలుచుకున్నాడు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. నిందితున్ని లొంగిపోవాలని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు, నిందితునికి మధ్య దాదాపు ఏడు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఎట్టకేలకు నిందితున్ని అదుపులోకి తీసుకొని తమకు అప్పగించినట్టు రిచర్డ్ రాస్ తెలిపారు. నిందితుని అదుపులో ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులను, ముగ్గురు పౌరులను రక్షించామని అన్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితున్ని మారిస్ హిల్(36) గా గుర్తించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నట్టు ఫిలిడెల్ఫియా పోలీసులు వెల్లడించారు.