Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంక్షలు ఎత్తివేసిన అరబ్ దేశం
రియాద్: మహిళలకు ప్రయాణ స్వేచ్ఛ కల్పిస్తున్నట్టు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలి కాలంలో పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులు కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. తాజాగా సౌదీ మహిళలకు 'ప్రయాణ స్వేచ్ఛ' లభించింది. 21ఏండ్లు పైబడిన మహిళలు ఇకపై తమ ఇంట్లోని పురుషుల అనుమతి లేకుండానే పాస్పోర్టు తీసుకోవచ్చు. విదేశాలకు కూడా వెళ్లొచ్చు.
ఈ సంస్కరణలను మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆగస్టు ఆరంభంలో ఈ సంస్కరణలను సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సౌదీ పాస్పోర్టు విభాగం ట్విటర్ ద్వారా వెల్లడించింది. సౌదీ అరేబియాలో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ దేశంలో మహిళలకు కఠిన నిబంధనలు ఉంటాయి. గార్డియన్షిప్ చట్టం ప్రకారం.. అక్కడి మహిళలు చదువుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా తండ్రి, భర్త లేదా సోదరుడి నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ గార్డియన్షిప్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారు. మహిళ ప్రగతి కోసం సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతేడాది నుంచి అక్కడి మహిళలు సొంతంగా వాహనాలు నడుపుతున్నారు.
ఇక పురుషులతో పాటు మహిళలు కూడా మైదానాలకు వచ్చి మ్యాచ్లు వీక్షించే అవకాశం కల్పించారు. గార్డియన్షిప్ చట్టాన్ని భరించలేక కొందరు ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు సౌదీ నుంచి పారిపోయి విదేశాల్లో ఆశ్రయం పొందారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేయగా.. కొందరు సంప్రదాయవాదులు మాత్రం ఇది ఇస్లాంకు విరుద్ధమంటూ విమర్శలు చేస్తున్నారు.