Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందానికి చేరువలో బ్రిటన్, ఈయూ
లండన్: బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి స్టీఫెన్ బార్క్లే, యూరోపియన్ యూనియన్ (ఈయూ) చీఫ్ బ్రెగ్జిట్ ప్రతినిధి మైఖెల్ బార్నియర్ శుక్రవారం నాడు సమావేశమై ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు ఉన్న అడ్డంకులను తొలగించే విషయమై తదుపరి విడత చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. ఉత్తర ఐర్లండ్, ఐరిష్ రిపబ్లిక్ మధ్య సరిహద్దు అంశాన్ని పరిష్కరించేందుకు బ్రిటన్ కొత్తగా ప్రతిపాదన ముందుకు తెచ్చిన నేపథ్యంలో చర్చలకు తాము సుముఖత చూపుతున్నామని ఈయూ కమిషన్ తెలిపింది. అంతమాత్రాన దీనికి చట్టబద్ధమైన ఆచరణాత్మక పరిష్కారం కుదిరినట్టు భావించలేము. కానీ, ఒప్పందానికి అవకాశాలు మెరుగయ్యా యని చెప్పవచ్చని ఈయూ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్ చెప్పారు. బ్రసెల్స్, లండన్ మధ్య ఒప్పందం కుదిరేందుకు ఇదొక గట్టి సంకేతమని ఆయన చెప్పారు. బార్నియర్తో చర్చల తరువాత బార్క్లే మాట్లాడుతూ, ఒప్పందం ఏ అంశాలపై కుదుర్చుకోవాలనేదానిపై తాము పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నామని అన్నారు. జటిలమైన ఐరిష్ సరిహద్దుపై వివాదాన్ని నివారించేందుకు బ్యాక్స్టాప్కు ప్రత్యామ్నాయం లేదా దానికి బదులు మరేదైనా ఏర్పాటు చూడాలని ఈయూ డిమాండ్ చేస్తున్నది. ఈయూతో తెగదెంపుల తరువాత బ్రిటన్ ఈ కూటమితో భవిష్యత్ సంబంధాలు ఎలా ఉండాలనేదానిపై ప్రకటించిన రాజకీయ తీర్మానాన్ని మెరుగుపరిచే విషయమై చర్చలు జరపాలని కూడా వారు నిర్ణయించారు. ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలన్న ప్రతిపాదనను ఎవరూ అంగీకరించే స్థితి లేదు. ఇరు పక్షాలకూ ఇది ఇబ్బందికరమేనని బార్క్లే అన్నారు.
బార్నియర్ శుక్రవారం బ్రసెల్స్ నుంచి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఆశావాదిని కాదు, అయినా బ్రెగ్జిట్‌పై ఒప్పందం కుదురుతుందన్న భావన నాలో ఉంది అని చెప్పారు. ఇరు పక్షాల మధ్య చర్చలు వచ్చేవారం కొనసాగడం ఒక సానుకూల పరిణామమన్నారు. బయటకు పొక్కిన ఓ మెమోను ఉటంకిస్తూ డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని బట్టి 27 దేశాలతో కూడిన ఈయూ కూటమి బ్రెగ్జిట్ తరువాత పరివర్తనా కాలంలో ఐరిష్ సరిహద్దు సమస్య ఎలాగూ తలెత్తుతుంది గనుక, ముందుగానే దీనిపై ఒక అంగీకారానికి రావడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు అర్థమవుతోంది. అక్టోబరు 17న ఈయూ కౌన్సిల్ కీలక సమావేశం జరగనున్నందున ఈ లోగానే దీనికి ఒక చట్టబద్ధమైన పరిష్కారం కనుగొనాలని జాన్సన్ తన సహచరులతో అన్నట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. డచ్ ప్రధాని మార్క్ రూటే అక్టోబరు31 కల్లా బ్రెగ్జిట్ డీల్ కుదిరే అవకాశం ఇప్పటికీ ఉందని అనడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ వార్షిక సమావేశాలు ఈ వారాంతంలో ఇంగ్లీష్ చానెల్ విడిది ప్రాంతమైన బ్రైటన్‌లో జరగనున్నాయి. బ్రెగ్జిట్పైనే అక్కడ ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.