Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రెగ్జిట్ కొత్త ఒప్పందాన్ని బ్రిటన్, ఈయూ ప్రతినిధుల బృందాలు అంగీకరించాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. గొప్ప నూతన ఒప్పందం కుదిరిందని జాన్సన్ గురువారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఈయూ నేతలు బ్రసెల్స్‌లో సమావేశం కానున్నారు. అనంతరం ఈ ఒప్పందానికి బ్రిటన్, యూరోపియన్ పార్లమెంట్ల ఆమోదం పొందవలసి ఉంటుంది. జాన్సన్ ఇచ్చిన ట్వీట్లో 'మనకు ఒక కొత్త ఒప్పందం కుదిరింది. ఇది పరిస్థితులను తిరిగి నియంత్రణలోకి తెస్తుంది. దీనికి పార్లమెంటు శనివారం ఆమోద ముద్ర వేయాలి. ఆ తర్వాత ఇతర ముఖ్యాంశాలైన జీవన వ్యయం, నేరాలు, పర్యావరణం, జాతీయ భద్రతపై దృష్టిపెట్టవచ్చు.' అని జాన్సన్ పేర్కొన్నారు. బ్రిటన్, యూరోపియన్ అధికారులు ఈ ఒప్పందం చట్టాల ప్రకారం ఏ విధంగా ఉండాలో పరిశీలించి రూపొందిస్తారు. అయితే ఒప్పందంలోని వివరాలు బహిర్గతం చేయలేదు.
సానుకూలంగా ఈయూ
బ్రిటన్ ప్రతిపాదిత కొత్త ఒప్పందాన్ని ఈయూ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ ప్రశంసించారు. వచ్చే గురువారం బ్రస్సెల్స్‌లో జరిగే సమావేశంలో ఐరోపా నేతలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాలని సూచించారు.
'ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఒప్పం దం ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు మనకు లభించింది. ఈ ఒప్పందం బాగుంది. అందరి ఆకాంక్షలకు తగినట్టు ఉంది. ఇది పరిష్కార మార్గాలను కనుగొనే ఓ వీలునామా వంటిది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది.' అని జీన్ క్లాడ్ జంకర్ అన్నారు
రెండు రోజుల పాటు చర్చలు..
అక్టోబర్31 లోపు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. ఈ సమయంలోగా ఒప్పందాన్ని ఆమోదించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు జాన్సన్. ఇందుకోసం బ్రిటన్ విదేశాంగ మంత్రి స్టీఫెన్ బార్క్లే నేతృత్వంలోని బ్రెగ్జిట్ బృందంతో మైకేల్ బర్నియర్ నేతృత్వంలోని ఈయూ ప్రతిని ధుల బృందం రెండు రోజుల పాటు చర్చించింది. సమాఖ్యలోని 28 దేశాలు ఆమోదించే విధంగా ఒప్పందంలో పలు అంశాలను తొలగించారు. అయితే ఈయూలోని ఐర్లాండ్, బ్రిటన్ అధీనంలోని ఉత్తర ఐర్లాండ్‌లో కస్టమ్స్, పన్ను విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
బ్రెగ్జిట్ అంటే ...
ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడమే బ్రెగ్జిట్. దీని కోసం 2016 జూన్‌లో రిఫరెండమ్ జరిగింది. దీనిలో ఓటు వేసినవారిలో 51.9 శాతం మంది ఈయూ నుంచి బ్రిటన్ బయటపడాలని కోరుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం బ్రెగ్జిట్‌ను అధికారికంగా 2017 మార్చిలో ప్రకటించింది. దీనికి రెండేండ్ల ప్రక్రియ జరగవలసి ఉంది. ఈ గడువు 2019 మార్చిలో ముగిసింది. కానీ దీనికి సంబంధించిన ఒప్పందానికి మూడుసార్లు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగలడంతో, ఈ గడువును రెండుసార్లు పొడిగించారు. తాజా గడువు 2019 అక్టోబరు31. కాగా, కొత్త ఒప్పందానికి ఈ నెల 19లోగా ఆమోదం లభించవలసి ఉంది.