Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెనడా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల విడుదల
- రెండో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రూడో
ఒట్టావా : కెనడా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో (47) నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా గెలుపొందింది.గత ఎన్నికల కంటే ఈఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ట్రూడో పార్టీ గట్టెక్కింది. కెనడా పార్లమెంట్లో 338 స్థానాలు ఉన్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీకి 184 సీట్లు వచ్చాయి. ఈ ఏడాది 158 సీట్లు మాత్రమే లిబరల్ పార్టీ సొంతం చేసుకుంది. 170స్థానాలు సాధించిన పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంటుంది. అయితే, లిబరల్ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కలేదు. మిగిలిన 13 సీట్ల కోసం ట్రూడోకు మరోపార్టీ మద్దతు అవసరం కానుంది. చిన్నపార్టీలతో కలిసి మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లిబరల్ పార్టీ విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరోసారి ప్రజల కోసం పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష కన్సర్వేటీవ్స్ 122 స్థానాలకే పరిమితమయ్యారు. నాలుగేండ్ల కిందట మొదటిసారి ప్రధానిగా ఎన్నికైన ట్రూడో అప్పటి నుంచి కెనడా రాజకీయాలను శాసిస్తున్నారు. గోల్డెన్ బారుగా పేరొందిన ఆయనపై తొలిదఫా పాలనాకాలంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఓటర్లు ట్రూడో పాలనవైపే మొగ్గుచూపారు.
అభినందనలు తెలిపిన నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. తమ ప్రగతిశీల అజెండాకు ప్రజలు పట్టంకట్టారని, ఆధునిక కెనడా ఆవిష్కరణకు కృషి కొనసాగిస్తానని ట్రూడో ఎన్నికల విజయం అనంతరం ప్రకటించారు.
జగ్మీత్ సింగ్ విజయం
కెనడా ఎన్నికల్లో న్యూడెమోక్రాటిక్ పార్టీ 16 సీట్లు సాధించింది. ఈ పార్టీ నేత, భారత సంతతి కెనడియన్ జగ్మీత్ సింగ్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని ట్రూడోకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన నూతన పార్లమెంట్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ట్రూడోకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే న్యూడెమోక్రాటిక్ పార్టీ మద్దతు లభిస్తుంది. అయితే, ఈ పార్టీ వాతావరణ మార్పులపై కచ్చితమైన కార్యాచరణ అమలు చేయాలని, కంపెనీలపై ఎక్కువ పన్నులు, సంపన్నులపై పన్నులు, కొత్తగా సామాజిక సార్వత్రిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ట్రూడో మద్దతు కోరుతోంది.