Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలికాన్ వ్యాలీ సంతాపం
వాషింగ్టన్: కంప్యూటర్లో విరివిగా వినియోగించే 'కట్, కాపీ, పేస్ట్' ఆవిష్కర్త.. జిరాక్స్లో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ల్యారీ టెస్లర్ మృతి చెందారు. సాంకేతిక రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆయన జ్ఞాపకాలను స్మరిస్తూ సిలికాన్ వ్యాలీ సంతాపం ప్రకటించింది. 74 ఏండ్ల వయసులో మృతి చెందిన టెస్లర్ సుదీర్ఘకాలం జిరాక్స్పైనే పరిశోధనలు చేశారు. అందులో అద్భుత ప్రావీణ్యం సాధించారు. 'కట్, కాపీ, పేస్ట్' కమాండ్లను రూపొందించి.. వాటిపై విస్తృత ఆవిష్కరణలు చేశారు. టెస్లర్ అమెజాన్, ఆపిల్, యాహూ వంటి దిగ్గజ సంస్థల్లో పలు హోదాల్లో తన విశిష్ట సేవలు అందిచారు. జిరాక్స్ విభాగంలో పాలో ఆల్టో పరిశోధనా సంస్థతో కలిసి పనిచేశారు.
ఫైండ్, రీప్లేస్లూ ఆయన సృష్టే
విస్తృతంగా ఉండే సమాచారంలో మనకు కావాల్సినది సులభంగా వెతుక్కునేలా, మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుండేలా రూపొందించిన 'ఫైండ్, రీప్లేస్' కమాండ్లను కూడా ఈయనే సృష్టించాడు. కంప్యూటర్ సైన్స్ శిక్షణను ప్రతి ఒక్కరికీ అవసరం అని గ్రహించారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కలిగి ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి టెస్లర్.' అని సిలికాన్ వ్యాలీలోని కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం పేర్కొన్నది.
బ్రౌజర్‌ను సూచించింది కూడా టెస్లరే..
బ్రౌజర్ అనే పదాన్ని కూడా అప్పట్లో లారీ టెస్లరే సూచించినట్టు చెబు తారు. అంతేగాకుండా, కంప్యూటర్‌కి సంబంధించి 'మోడ్లెస్' విధానాన్ని అభివృద్ది చేయడంలో ఆయన చాంపియన్ అని చెబుతారు. టెస్లర్, అతని స్నేహితుడు కలిసి పాలో అల్టో రీసెర్చ్ సెంటర్ లో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్‌పై పనిచేస్తున్నప్పుడు దీన్ని అభివృద్ది చేశారు.
అమెరికాలోని న్యూయార్క్, బ్రోంక్స్లో1945లో టెస్లర్ జన్మించారు. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కంప్యూటర్ పనితీరును మరింత సులభతరం చేసే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్‌లో స్పెషలైజేషన్ చేశారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేశారు. జిరాక్స్ పాలో అల్టో రీసెర్చ్ సెంటర్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్‌తో కలిసి ఆ కంపెనీ కోసం పనిచేశారు. అక్కడ దాదాపు 17ఏండ్ల పాటు పనిచేసిన ఆయన... చీఫ్ సైంటిస్ట్ స్థాయికి ఎదిగారు. ఆపిల్ నుంచి బయటకొచ్చాక టెస్లర్ సొంతంగా ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించారు. మధ్యలో కొంతకాలం అమెజాన్,యాహూ కంపెనీలతోనూ పనిచేశారు. పాత రోజుల్లో పేపర్ క్లిప్స్‌ను కత్తిరించి.. వాటిని మరో చోట అతికించే విధానాన్ని స్పూర్తిగా తీసుకుని.. కట్.. కాపీ.. పేస్ట్ సాంకేతికతను అభివృద్ది చేశారు. 1983లో ఆపిల్ సంస్థ లిసా కంప్యూటర్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. ఆ తర్వాత ఏడాదిలో దాని ఒరిజినల్ వెర్షన్‌ను విడుదల చేశారు. ఆ తర్వాతే టెస్లర్ పేరు బాగా పాపులర్ అయింది.