Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలో నిలిచిన బిడెన్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థికి ట్రంప్ అభినందనలు
లాస్‌వేగాస్: నెవాడాలో శనివారం జరిగిన కాకసెస్‌లో నిర్ణయాత్మక విజయం సాధించిన డెమోక్రాటిక్ పార్టీ నేత బెర్నీ శాండర్స్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. మొదటి రెండు కాకసెస్‌లో చివరి స్థానంలో నిలిచిన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ నెవాడాలో రెండోస్థానంలోకి దూసుకు రావటంతో అభ్యర్థిత్వ రేసులో ఆయన ఆశలు సజీవంగా నిలిచాయి. నెవాడా ప్రైమరీస్‌లో శాండర్స్ 47 శాతం ఓట్లు సాధించగా, 43 శాతం మంది బిడెన్‌ను సమర్ధించారు. నెవాడాలో శాండర్స్ విజయంలో యువ, మధ్యవయస్సు ఓటర్లతోపాటు లాటినోలు, కార్మిక సంఘాలు, శ్వేతజాతి యువతులు కీలకంగా నిలిచారని ఆయన ప్రచారంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఎడిసన్ రిసెర్చ్ సంస్థ వెల్లడించింది. 'తరాలు, జాతులకతీతంగా లభించిన ఈ మద్దతు కేవలం నెవాడా గెలుపును మాత్రమే కాక దేశంలో కూడా స్వీప్ చేస్తుందని శాండర్స్ తన మద్దతుదారులనుద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ అభ్యర్థిత్వ రేసులో అయోవా, న్యూహాంప్‌షైర్ కాకసెస్‌లో నాలుగో స్థానానికే పరిమితమైన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ నెవాడాలో రెండో స్థానంలో నిలిచారు. జాతుల పరంగా విభిన్నమైన వాతావరణం ఉన్న అమెరికాలో శాండర్స్ విజయం ఆయన చెబుతున్న సామాజిక, ఆర్థిక న్యాయాలకు ప్రతీకగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు అమెరికన్లందరికీ సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణా విదానాన్ని ప్రవేశపెడతామని చెబుతున్న ఆయన మాటలు డెమోక్రాటిక్ ఓటర్లలో ఆశలు చిగురింప చేస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నెవాడా ప్రైమరీస్‌లో శాండర్స్ 47 శాతం ఓట్లు సాధించగా, 43 శాతం మంది బిడెన్‌ను సమర్ధించారు. అయోవా, న్యూహాంప్‌షైర్ ప్రైమరీస్‌లో శాండర్స్‌తో పోటీ పడిన సౌత్‌బెండ్ నగర మాజీ మేయర్ పీట్ బుటిగీగ్ నెవాడాలో 15 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు ప్రైమరీలలో పేలవమైన ఓట్లు సాధించిన సెనేటర్ ఎలిజెబెత్ వారెన్ నెవాడాలో కూడా 9 శాతానికే పరిమితమయ్యారు. ఓటింగ్ ఫలితాలు వెల్లడయిన తర్వాత ఆయన లాస్వేగాస్లో తన మద్దతుదారులతో మాట్లాడుతూ కేవలం సైద్ధాంతిక వాదనలకు మాత్రమే పరిమితమవుతున్న శాండర్స్‌ను అభ్యర్థిగా నిర్ణయంచటంలో ఆలోచించి ముందడుగు వేయాలంటూ బుటీగీగ్ డెమొక్రాటిక్ నాయకత్వానికి సూచించారు. నెవాడా విజయంతో అభ్యర్థిత్వ రేసులో తన స్థానాన్ని పదిలం చేసుకున్న శాండర్స్, రెండో స్థానానికి చేరిన బిడెన్ ఇక ఈ నెల 29న సౌత్ కరోలినాలో జరుగనున్న తదుపరి ప్రైమరీస్పై దృష్టి సారించారు. దీని తర్వాత 14 రాష్ట్రాలలో మార్చి 3న సూపర్ ట్యూస్డే పోటీలు జరుగతాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి నిర్ణయంలో ఈ సూపర్ ట్యూస్డే పోటీలు కీలకం కానున్న విషయం తెలిసిందే. వాస్తవానికి నెవాడాలో నాలుగు రోజుల ముందే అనేక ప్రాంతాలలో ఓటింగ్ ప్రారంభమైనా ఓటింగ్ నిబంధనలతో అధికారులు, ఓటర్లు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఈ నాలుగు రోజుల ముందస్తు ఓటింగ్‌లో దాదాపు 75 వేల మంది డెమోక్రాట్స్ పాల్గొన్నారు. వీరిలో సగానికి పైగా తొలిసారి ఓటు హక్కు వినియోగిం చుకుంటున్న వారే కావటం విశేషం. గతంలో 2008లో ఒబామా అభ్యర్థిత్వాన్ని నిర్ధారించిన లాస్‌వేగాస్ ప్రైమరీస్‌లో రికార్డు స్థాయిలో 1,18,000 మంది ఓటర్లు పాల్గొన్న విషయం తెలిసిందే. ముందస్తు ఓటింగ్‌లో పోలయిన ఓట్లను కూడా శనివారం పోలయిన ఓట్లతో కలిపి లెక్కించారు. తుది ఫలితాలన్ని లాస్‌వేగాస్ స్ట్రిప్‌లోని బెలాజియో హోట ల్లో వెల్లడించారు. తుది ఫలితంలో శాండర్స్ 76 ఓట్ల ఆధిక్యంతోనూ, బిడెన్ 45 ఓట్ల ఆధిక్యంతోనూ ఒకటి, రెండు స్థానాలలో నిలవగా, మరెవరికీ ఒక్క ఓటు కూడా లభించకపోవటం గమనార్హం. నెవాడా ఓటిం గ్లో 65 ఏండ్ల పైబడిన వారు తప్ప ఇతర అన్ని వయసుల ఓటర్లలోనూ శాండర్స్‌కు గట్టి మద్దతు లభించింది. లాటిన్ అమెరికన్ ఓటర్లలో 54 శాతం మంది శాండర్స్‌ను సమర్ధించగా, కాలేజ్ విద్యనభ్యసిస్తున్న యువతుల్లో 24 శాతం మంది, కార్మిక సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులు 34 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోందంటూ అధికారులు శాండర్స్‌కు చెప్పటంతో, ఎన్నికల్లో జోక్యం చేసు కోవద్దని ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. నెవాడా కాకసెస్‌లో నిర్ణయాత్మక విజయం సాధించిన బెర్నీ శాండర్స్‌ను రిపబ్లికన్‌పార్టీ నేత, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. శాండర్స్ చివరి వరకూ ఇదే విజయాలను సాధిస్తూ అధ్యక్ష ఎన్నికల్లో తనకు బలమైన పోటీ ఇస్తారని భావిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. నెవాడా వంటి గొప్ప రాష్ట్రంలో శాండర్స్ సాధించిన విజయం అభినందనీయమని ఆయన తన ట్వీట్లో అభినందించారు.