Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విమర్శ
బీజింగ్ : చైనా, అమెరికా మధ్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని(కోల్డ్ వార్)ను రుద్దేందుకు అమెరికాలోని కొన్ని రాజకీయశక్తులు కుట్ర పన్నుతున్నాయని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌యీ విమర్శించారు. అదే సమయంలో కరోనా నియంత్రణలో చైనాతో కలిసి రావాలని అగ్రరాజ్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న 13వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) సమావేశాల సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ప్రతిరోజూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా తగిన చర్యలు తీసుకోని అక్కడి ప్రభుత్వం చైనాపై బురద చల్లుతూ పలు రకాలుగా దాడి చేస్తున్నదని, ఇప్పుడు అమెరికాలో కూడా ఆ రాజకీయ వైరస్ వ్యాప్తి చెందుతుండడం విచారకరమని అన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా కొంత మంది అమెరికాకు చెందిన రాజకీయ నాయకులు చైనా గురించి అనేక అబద్ధాలను వల్లెవేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణలు కరోనాపై ఎన్ని చెబుతున్నా అమెరికాకు చెందిన రాజకీయ నేతలు కరోనాను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వైరస్ మూలాల్ని గుర్తించేందుకు అంతర్జాతీయ సహకారానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. కరోనా పుట్టుకకు సంబంధించి చైనాపై దాఖలైన వ్యాజ్యాలు పూర్తిగా నిరాధారమైనవని వాంగ్‌యీ కొట్టిపారేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా చేస్తున్న ఆరోపణలను వాంగ్‌యీ ఖండించారు. కరోనాను సులువుగా ఎదుర్కొన్న చైనాకు ఈ రాజకీయ వైరస్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉందన్నారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్ మరకల గురించి అమెరికా చేస్తున్న దుష్ప్రచారాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, అబద్దపు ప్రచారాలతో చరిత్రపై వారు వేసిన మరకలు చరిత్రలో చాలా ఉన్నాయని వ్యాఖ్యనించారు. వైరస్ మూలాన్ని గురించి శోధించాల్సిందే. కానీ, ఆ పేరుతో ప్రజల ప్రాణాలను కాపాడే బృహత్తర బాధ్యతను విస్మరించడం సరికాదన్నారు. వైరస్ ఎక్కడి నుంచి పుట్టిందనేదానిని శాస్త్రీయ పద్ధతిలో గుర్తించేందుకు జరిగే కృషికి చైనా నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. హాంగ్‌కాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతానికి సంబంధించి తెచ్చిన జాతీయ భద్రతా చట్టం గురించి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు, చట్టబద్ధమైన హక్కులపై ఇది ఎలాంటి ప్రభావం చూపదన్నారు. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతను కాపాడడమే ఈ చట్టం ఉద్దేశమన్నారు. దేశభద్రతను అనిశ్చితిలోకి నెట్టాలని చూసే కొన్ని చిన్న బృందాలను శిక్షించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుందన్నారు. హాంగ్ కాంగ్ గరిష్ట స్వయంప్రతిపతిపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు.