Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అణ్వాయుధాలపై అమెరికా భారీ ఖర్చు
వాషింగ్టన్ : అణ్వాయుధాలపై ట్రంప్ సర్కార్ చేస్తున్న అధిక ఖర్చు రానున్న కాలంలో కొత్త ఆయుధ పోటీని పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఇతర దేశాలు కూడా తమ భద్రత దృష్ట్యా అణ్వాయుధాల తయారీపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందనీ, తద్వారా అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2019లో అణ్వాయుధాలపై ప్రపంచంలోని తొమ్మిది దేశాలు చేసిన ఖర్చు 73 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో దాదాపు సగం శాతం ఒక్క అమెరికా దేశానికి చెందినదే కావడం గమనార్హం. ఇదే సమయంలో న్యూక్లియర్ ఒప్పందాల నుంచి తప్పుకుంటూ, రక్షణ రంగ బడ్జెట్లో కూడా ట్రంప్ సర్కార్ అణ్వాయుధాల తయారీకే పెద్దపీట వేస్తోంది. ఈ విధంగా న్యూక్లియర్ అంశాలకు సంబంధించి చర్చలకు స్వస్థి పలకడం ఇతర దేశాలను కలవరపెడుతోంది. ట్రంప్ ప్రభుత్వ పొందికైన లక్ష్యాలు, వ్యూహాలు, విధానాల లేమి న్యూక్లియర్ ప్రమాదాలను మరింత పెంచేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా అనుసరిస్తున్న గుడ్డి వైఖరి తీవ్ర విధ్వంసకర పరిణామాలకు దారి తీస్తుందని ఈ ఏడాది మే నెలలో విడుదలైన న్యూక్లియర్ ఖర్చుకు సంబంధించిన రెండు నివేదికలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.
న్యూక్లియర్ పరీక్షలను తిరిగి ప్రారంభించే విషయమై ట్రంప్ ప్రభుత్వం చర్చలు ప్రారంభించినట్లు వాషింగ్టన్ పోస్టు మే నెలలో పేర్కొంది. 2018తో పోల్చుకుంటే 2019లో అణ్వాయుధాలపై పలు దేశాలు చేస్తున్న ఖర్చు దాదాపు 7 బిలియన్ డాలర్ల మేర పెరిగిందనీ, 2019లో రోజుకు 200 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేశారని ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అభాలిష్ న్యూక్లియర్ వెపన్స్(ఐసీఎఎన్) తన నివేదికలో పేర్కొంది. 2019లో తొమ్మిది దేశాలు దాదాపు 13 వేల అణ్వాయుధాలపై తయారీపై ఖర్చు చేశాయని తెలిపింది. వీటిల్లో రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్‌లు న్యూక్లియర్ ఖర్చును స్వల్పంగా పెంచగా, యూకే, ఉత్తర కొరియా, ఇజ్రాయిల్‌ల ఖర్చులో పెద్దగా మార్పు లేకపోగా, పాకిస్థాన్ తన ఖర్చును కొద్దిమేర తగ్గించుకుంది. ఇక, అమెరికా విషయానికి వస్తే 2018లో అణ్వాయుధాలపై ఆ దేశ ఖర్చు 29.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2019 నాటికి అది 35.4 బిలియన్ డాలర్లకు చేరింది.
ప్రస్తుతం ఉన్న అణ్వాయుధాల ఆధునీకరణ, ఆయుధశాలల విస్తరణ రానున్న కాలంలో అణ్వాయుధాలపై ఖర్చును మరింత పెంచే అవకాశం ఉందని ఐసీఎఎన్ పాలసీ అండ్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అలిసియా సాండర్స్ అభిప్రాయపడ్డారు. మొత్తం సైన్యంపై చేస్తున్న వ్యయంలో కేవలం అణ్వాయుధాలపైనే 5 శాతం అమెరికా ఖర్చు చేస్తున్నట్టు ఐసీఎఎన్ నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలను ప్రభుత్వ బడ్జెట్ పత్రాల నుంచి సేకరించామని, ఈ ఖర్చులో పర్యావరణ పరిహారాలు, న్యూక్లియర్ పరీక్షలు, వినియోగం కారణంగా బాధితులగా మారే వారికిచ్చే పరిహారాన్ని చేర్చలేదని సాండర్స్ తెలిపారు.