Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-34 కోట్ల ఉద్యోగాలకు ముప్పు
- కోవిడ్ ప్రభావం మహిళలపై తీవ్రం: ఐఎల్వో
న్యూయార్క్ : ఈ ఏడాది ద్వితీయార్థంలో కరోనా మళ్లీ విజృంభిస్తే.. దాని ప్రభావం కోట్లాది మంది ఉద్యోగుల మీద పడనుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) హెచ్చరించింది. కోవిడ్-19 మళ్లీ కోరలు చాచితే.. ప్రపంచవ్యాప్తంగా 11.9 శాతం పనిగంటలు కోల్పోవాల్సి వస్తుందనీ, ఇది 34 కోట్ల ఫుల్‌టైం ఉద్యోగాలు కోల్పోవడానికి సమానమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత శ్రామిక మార్కెటు అనిశ్చితితో కూడుకున్నదనీ, దీని నుంచి కోలుకోవడం అంత సులభం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు 'ఐఎల్వో మానిటర్ : కోవిడ్-19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్' ఐదవ ఎడిషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 14 శాతం పనిగంటలు తగ్గాయి. ఇది 40 కోట్ల పూర్తికాల (ఫుల్‌టైం) ఉద్యోగాలు కోల్పోవడానికి సమానం. ఇది గతంలో అంచనావేసిన దానికంటే తీవ్రంగా ఉంది. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఆర్థిక మందగమనంతో మౌలిక ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక కార్యకలాపాలేమీ పుంజుకోకపోవడం కారణంగా.. ద్వితీయ త్రైమాసికంలో 5.4 శాతం పనిగంటలు (15.5 కోట్ల ఉద్యోగాలు) తగ్గుతాయని ఐఎల్వో అంతకుముందు అంచనావేసింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా అంతకు రెట్టింపుగా పనిగంటలను కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఏడాది రెండో భాగంలో పరిస్థితులు మరింత అద్వాన్నంగా మారే ముప్పు పొంచి ఉన్నది. 2020 రెండో భాగంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తే గనక.. అంతర్జాతీయంగా 34 కోట్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో..
తాజా గణాంకాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఎల్వో డైరెక్టర్ జనరల్ గై రైడర్ అభిప్రాయపడ్డారు. రెండో త్రైమాసికంలో పనిగంటలు కోల్పోయే దేశాల్లో.. అమెరికాలో 18.3 శాతం, యూరప్, మధ్య ఆసియాలలో 13.9 శాతం, ఆసియా, ఆసియా పసిపిక్లలో 13.5 శాతం, అరబ్ దేశాల్లో 13.2 శాతం, ఆఫ్రికాలో 12 శాతం ఉండనుంది.
చేయాల్సింది చాలా ఉంది : గై రైడర్
మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచవ్యా ప్తంగా పలు దేశాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే మన ప్రయత్నాలను రెట్టింపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు, అవలంభించే విధానాలు రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.