Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా: అమెరికా ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నిటినీ అధిగమించి కరోనాపై పోరులో ప్రపంచానికి క్యూబా అండగా నిలుస్తున్నది. క్యూబాకు చెందిన అంతర్జాతీయ వైద్య సహకార బృందాలను అనర్హులను చేయాలని అమెరికా రకరకాలు ప్రయత్నిస్తోంది. ఈ అననుకూల వాతావరణంలో సైతం క్యూబా ఈ భూమండలంపై ఉన్న వివిధ ప్రాంతాలకు తన వైద్య బృందాలను పంపుతోంది. 2005లో ఫైడెల్ కాస్ట్రో ఏర్పాటుచేసిన హెన్రీరీవ్ బృందంలో సభ్యులైన వీరు ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతారు. అది భయంకరమైన అంటువ్యాధుల మహమ్మారి కావచ్చు, వరదలు, భూ కంపాలు వంటి విపత్తులు కావచ్చు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. లేదా ఇటీవల పశ్చిమాఫ్రికా దేశాలను వణికించిన డెంగీ, ఎబోలా వంటి వ్యాధులు కావచ్చు. ఎవరూ వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికపై వైద్య సేవలు అందించడంలో వీరికి ఎవరూ సాటిరారు. అపారమైన అనుభవం, ఎంతో విశిష్టమైన చరిత్ర ఉండబట్టే కరోనాపై పోరులో క్యూబా వైద్య నిపుణుల సహకారాన్ని ప్రపంచంలో చాలా దేశాలు కోరుతున్నాయి. ఇప్పటికే 59 దేశాల్లో క్యూబన్ నిపుణులు ఇటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. గత మూడు మాసాల్లో క్యూబా 31 దేశాలకు 38 హెల్త్ బ్రిగేడ్లను పంపింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 3,440 మంది హెల్త్ వర్కర్లను సమీకరించింది. వీరిలో 65 శాతం మంది మహిళలే కావడం విశేషం. 1,944 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లు ఈ బృందంలో పనిచేస్తున్నారు. తెల్ల కోటు ధరించిన ఈ క్యూబన్లు వెనిజులా, సెయింట్ విన్సెంట్, గ్రెనెడా, డొమినికా, సురినామ్ తదితర దేశాల్లో పనిచేస్తున్నారు. అంగోలా, టోగో, గినియా-బిసావు, దక్షిణాఫ్రికా, కేప్ వెర్డే, గినియా రిపబ్లిక్ లో కూడా వీరు కనిపిస్తారు. పర్షియన్ గల్ఫ్‌లోని ఒమన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్తదితర దేశాల్లోనూ వీరు పని చేస్తున్నారు. ఇటలీ, అందోరా, టర్కీ, బ్రిటన్‌కు చెందిన కైకస్ దీవులు, ఫ్రెంచ్ సార్వభౌమత్వం కింద వున్న మార్టింక్యూ దీవులకు కూడా వీరి సేవలు విస్తరించాయి.