నవతెలంగాణ-హైదరాబాద్ : కుప్పం యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. ఆయన గుండెపోటుకు గురైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. కాగా, మెరుగైన వైద్యం కోసం తారకరత్నను కాసేపట్లో బెంగళూరు తరలించనున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. నారాయణ హృదయాలయ ఆసుపత్రి చైర్మన్ దేవిశెట్టితో కుప్పం పీఈఎస్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలింపుపై చర్చించారు. ఎయిర్ అంబులెన్స్ లో తరలింపునకు అనుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
బెంగళూరులో తారకరత్నకు చికిత్స నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో ఫోన్ లో మాట్లాడారు. తారకరత్నను బెంగళూరు తీసుకువస్తున్నారని, సత్వరమే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా నగరంలో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, కుప్పం, బెంగళూరు వైద్యులతో చంద్రబాబు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
Recomended For You