నవతెలంగాణ - ఢీల్లి
హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక, అదానీ కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో వరుసగా మూడో రోజు పార్లమెంట్ స్తంభించింది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే మరో రోజుకు వాయిదా పడింది. ఈ తరుణంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో విపక్షాల ఆందోళనలతో ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఉభయ సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో వరుసగా మూడో రోజూ పార్లమెంట్‌లో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఆందోళనల క్రమంలో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు.
Recomended For You