పోరాటం పుట్టిమునిగింది ఆశ అడియాస అయ్యింది అరచేతులు అడ్డుపెట్టి ఏళ్లతరబడి కాపుగాసిన ఆశయం- కొత్త కాపేమీ కాయకుండానే వట్టిపోయింది రెపరెపలాడుతున్న దీపం గాలి హౌరు లేకుండానే మలిగిపోయింది * జరిగిన అత్యాచారమే కాదు, వారికి జరిగిన సత్కారం కూడా- నిన్ను ఏకాకిని చేసి దూరంగా నిలబెట్టింది దోషులను బోనులెక్కించకపోవడమే కాదు, వారిని అక్కున చేర్చుకుని కూడా- చూపుడు వేళ్లన్నీ నిన్ను మానసిక ఉరికంబం ఎక్కించాయి మలినాన్ని నీ దేహానికి పులమడమే కాదు, వారిని పరిశుద్ధులుగా కొలిచి కూడా- సభ్యసమాజం తన ఆత్మను చంపేసుకుంది * అడియాసలు వడిసెలు తిప్పే రోజు వస్తుంది ఆశయం కొత్త చిగుర్లతో కొమ్మలు చాస్తుంది పోరాటం అరచేతిలో పురివిప్పుకుంటుంది కొండెక్కిన దీపం మళ్లీ దావానలమై చిచ్చురేపుతుంది దుఃఖాన్ని విడిచిన దేహం- కొత్త ఆత్మను ఆవాహన చేసుకుంటుంది