నీటిలో ఎగిరే చేపపిల్లల్ని చూస్తేనో భయం భయంగా గంతులేసే జింక పిల్లను చూస్తేనో వసివాడని బాల్యమే గుర్తుకు రావచ్చునేమో
చేతులు చాచిపిలిచే ఆకాశాన్ని చూసినప్పుడల్లా చెట్టంత ధైర్యాన్నిచ్చే నాన్నే గుర్తుకురావచ్చునేమో
ఆకలి తీర్చే ముద్ద నోట్లోకొచ్చినప్పుడల్లా అలసిన దేహాన్ని చల్లని చేతుల్తో అలసట పోగొడుతూ ఒడిలో దాచుకున్న పచ్చని నేలను తాకినప్పుడల్లా అమ్మే గుర్తుకు రావచ్చునేమో
ఒకర్నొకరు చూసుకుంటూ సుఖదుఃఖాల్ని సమానంగా పంచుకుంటూ బాధనో, గాథనో చెరొకభుజంగా మోసుకుంటూ గమ్యం చేరే దాకా పోయే రైలు బండిని చూసినప్పుడల్లా నువ్వూ నేనూ పంచుకున్న మన జీవిత భాగస్వామ్యమే గుర్తుకురావచ్చునేమో
పరస్పరం ఆకర్షించుకుంటూనే చెరో వైపూ పరిభ్రమించే సూర్య చంద్రులను చూసినప్పుడల్లా నేనూ నువ్వూ చెరొక తీరంలో కలవనట్లుంటూనే కలిసుంటున్న మన ప్రతిబింబాలే గుర్తుకురావచ్చునేమో!