అడుగు అడుగు లెక్కకట్టి కొన్ని దూరాలను కొలుచుకుని మజిలీ మజిలీలోనూ విషాదానందాలను లిఖించుకొని ఇంకా ఇంకా ఏదో దేవుకునే తచ్చాటే
భూమి ఆకాశం కలుస్తున్న మాయాదృశ్యాలతో సేదతీరి తియ్యటి స్వప్నాలను ఒలికిస్తుంది దేహం
నడిసంద్రమెంత నిర్మలంగా నిశ్శబ్దంగావున్నా చిల్లుపడ్డ పడవలో బ్రతుకు భద్రత ఊహించుకోవచ్చు
కాలం కొయ్యకు నిన్ను నీవు తగిలించుకున్నాక తిరిగిరాని సమయ సమూహాలను మళ్లీ ఎలా ప్రోది చేసుకుంటావు గతంకాదు వర్తమానంలో జీవించటం నేర్చుకో భవిష్యత్తు రెక్కలు కట్టుకొని వాలుతుంది
నీతో అంటిపెట్టుకున్న క్షణాల గొలుసు ముడులను నీ ముగింపు వాక్యం వరకూ విప్పలేవు రెండుకొసల్ని ఒకే ముడేసినట్టు చావు పుట్టుకల్ని కలుపలేవు
ఎందుకంత తపస్సు రెప్పపాటుకాలం చాలదూ నిన్ను నీవు అవలోకనం చేసుకునేందుకు
ఓ కొత్త నియమం నవీన పాదముద్రలకు నాంది బ్రతుకు ఎండిపోయిందని మండిపోకు మోడుకు పుట్టిన అంకురం ఆకులు ఆకులుగా మొలకెత్తి పూలతో పుప్పొడులతో పుడమిపై పురివిప్పటం మోడు లోలోపలి విశ్వాసం
చూపుల చిట్ట చివర అడవంతా నునుపైన పచ్చని సోయగమే దరిచేరితేగాని ఎత్తుపల్లాలు ముళ్లు ముసళ్లు రాళ్లు రాక్షస గూళ్లు తేటతెల్లం కావు బ్రతుకొక అడవి మనలోకి మనమే నిత్యం దెగ్గరవుతూ వుండాలి..!