లోపం ఏదయినా నింద మాత్రం ఆకుకూరల మీదే ఏ కూర మీద ఇష్టం ఉన్నా తోటకూర పాలకూర మీదనే మనసు
ముసలితాతకు చేతికర్ర సాయమయినట్టు కంటి మీద వాలుతున్న చీకటి తోక ముడుచుకుని పోయేలా ముఖానికి కట్టుకున్న లాంతరు కళ్ళజోడు కళ్ళు ఎత్తుకున్న ముక్కుమీది కిరీటం
చూపు దూరమవుతున్న కొద్ది భర్తకు భార్యలా భార్యకు భర్తలా ముడి బిగుసుకున్న అర్ధనారీశ్వరుల బంధం
పాదాలకు చెప్పులు తొడిగినట్టు వొంటికి చొక్కా తొడుక్కున్నట్టు చూపు పైన జరుగుతున్న దాడి ఏదో తరిమికొట్టేందుకు కళ్ళు తొడుక్కున్న కవచం
ఇప్పుడంతా వింతే ఏది చెప్పినా అతికినట్టు ఉండదు కనబడంది కనబడినట్టు ఎంత ఏమార్చినా గోడ నిలబడదు గుట్టు దాచడం చేతకానప్పుడు గుండె తలుపులు తెరవాల్సిందే
ఇకపై ఇంట్లో అవిభక్త కవలల్లా ఊళ్ళో గ్రహాంతర వాసిలా కొత్తగా తిరగాలి ఎప్పటికప్పుడు మిత్రుడు జారిపోకుండా సరిచూసుకోవాలి చితి వరకూ తొడొచ్చే విశ్వాసం మచ్చిక చేసుకోవాలి.