నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు తారకరత్న నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 'కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నాం' అని ఆస్పత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో 'యువగళం' పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.