నవతెలంగాణ - పల్నాడు పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. రొంపిచర్ల మండలం అలవాలలో జరిగిందీ ఘటన. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన టీడీపీ నేతల చదలవాడ అరవిందబాబు ఆసుపత్రికి వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు, కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.