- నింగిలోకి 9 ఉపగ్రహాలు సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్-6 ఉపగ్రహంతోపాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను విజయవంతంగా రెండు వేర్వేరు అంతరిక్ష కక్ష్యల్లోకి పంపారు. బంగారు వర్ణంలో నిప్పులు చెరుగుతూ ఆకాశం వైపునకు రాకెట్ దూసుకెళ్లింది. సరిగ్గా 17 నిమిషాల 21 సెకండ్లకు రాకెట్ పైభాగంలోని ఓషన్‌శాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో నిలిపింది. ఈ ఉపగ్రహం అంతరిక్షం నుంచే సముద్ర గర్భంలో చేపల ఉనికిని తెలియజేస్తుంది. అనంతరం రాకెట్‌లోని చివరి భాగం దిశ మార్చుకుని మరో దిశవైపు ప్రయాణించి మిగిలిన ఆస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలు నాలుగింటిని, తైబల్ట్ ఉపగ్రహాలు రెండింటిని, ఆనంద్ ఉపగ్రహాలతోపాటు ఇండియా భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహాన్ని కక్ష్యలో నిలపడంతో ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం పూర్తి కావడానికి రెండు గంటల ఐదు నిమిషాల సమయం పట్టింది. భూటాన్‌లో మానవ వనరుల అవసరాలకు, సాంకేతిక అభివృద్ధికి ఐఎన్‌ఎస్-2బి ఉపగ్రహాన్ని భారత్ సహకారంతో ప్రయోగించారు.