కాశ్మీర్ ఫైల్స్‌పై ఇజ్రాయిలీ డైరెక్టర్ వ్యాఖ్యలకు జ్యూరీ సభ్యుల మద్దతు
Sun 04 Dec 04:45:38.274245 2022
- ఇవి రాజకీయ విమర్శలు కాదని వెల్లడి న్యూఢిల్లీ : భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) లో ప్రదర్శితమైన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అసభ్యకరంగా వుందంటూ ఇజ్రాయిలీ డైరెక్టర్, అంతర్జాతీయ జ్యూరీ హెడ్ నడవ్ లపిడ్ వ్యాఖ్యానించి పతాక శీర్షికల్లోకి ఎక్కిన కొద్ది రోజుల తర్వాత జ్యూరీ సభ్యులందరూ కూడా ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. జ్యూరీ సభ్యుల్లో వున్న ఒకే ఒక భారతీయుడు మాత్రం దీనిపై సంతకం చేయలేదు. కేంద్ర మంత్రులు హాజరైన ఇఫీ ముగింపు ఉత్సవంలో లపిడ్ మాట్లాడుతూ, ఈ చిత్రంపై తన ఆలోచనలను జ్యూరీ సభ్యులతో పంచుకున్నానని చెప్పారు. ముగ్గురు విదేశీ సభ్యులు కూడా లపిడ్ వ్యాఖ్యలను తాము సమర్ధిస్తున్నామని చెప్పారు. మరో జ్యూరీ సభ్యుడు జింకో గోటో శనివారం ట్వీట్ చేస్తూ, లపిడ్ వైఖరికి మద్దతిచ్చారు. కాగా ఏకైన భారత జ్యూరీ సభ్యుడు సుదీప్తో సేన్ మాత్రం లపిడ్ ప్రకటనతో విభేదించారు. అసలు ఈ చిత్రం ఇక్కడ ప్రదర్శనకు ఎంపికవడం పట్ల లపిడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ వార్తాపత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేవలం రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఈ చిత్రం ఇక్కడకు వచ్చి వుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. పైగా ఈ చిత్రంలో వున్న విషయంపై రాజకీయ కోణంలో తాము మాట్లాడడం లేదని, కేవలం కళాత్మకమైన కోణంలోనే మాట్లాడుతున్నామని జ్యూరీ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.