- కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల ప్రచార సరళిపై స్పందిస్తూ తాను చేసిన 'రావణ్' వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. 'గుజరాత్ మోడల్' అంతా డొల్ల అని తేలిన నేపథ్యంలో బీజేపీకి ఓట్లు అడిగేందుకు ఏమీ మిగలలేదనీ, అందువల్లే విధానాలు కాకుండా వ్యక్తిగత విద్వేషాలతో నానాపాట్లు పడుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే 'నన్ను చూడండి.. నన్ను చూడండి' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లను కోరడంపై స్పందిస్తూ 'మీకేమైనా రావణుడిలా పదో, వందో తలలున్నాయా?' అంటూ ఖర్గే ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మోడీ, బీజేపీ నేతలు ద్వేషపూరిత వ్యాఖ్యలుగా పేర్కొంటూ ఓటర్ల ఎదుట వాపోతున్నారు. ఇది పెద్ద నాటకమని, దీనికంటే ప్రధానమైన సమస్యలను కావాలనే బీజేపీ నేతలు, మోడీ విస్మరిస్తున్నారని ఖర్గే అన్నారు. 'మాకు రాజకీయా లంటే వ్యక్తిగతమైనవి కాదు. విధానపరమైనవి. బీజేపీ వ్యక్తికేంద్ర విద్వేషాలపైనే ఆధారపడుతోంది' అని ఖర్గే తెలిపారు. ప్రధాని మోడీ శైలీ రాజకీయాల్లో ప్రజా స్వామ్య స్ఫూర్తి కొరవడుతోందని, దీనికి తాను చాలా ఉదంతాలు ఉదహరించగల నని చెప్పారు. పార్లమెంటరీ రాజకీయాల్లో తనకు 51 సంవత్సరాల అనుభవం ఉందనీ, తాను ఏనాడూ వ్యక్తిగతమెది వ్యాఖ్యలు చేయనని, బీజేపీని కూడా తాను విమర్శలు గుప్పించింది.. కేవలం అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే అని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలకు పరిష్కారాలపై చర్చ జరగాలని, వ్యక్తిగతమైన అంశాలపై కాదని ఆయన చెప్పారు.