న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును 'అమృత్ ఉద్యాన్'గా కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు. 'అమృత్ ఉద్యాన్'గా పేరు మార్చిన ఈ గార్డెన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఉదయం ప్రారంభించనున్నారు. ప్రతి ఏటా నిర్వహించే 'ఉద్యానోత్సవం'లో భాగంగా ఈ ఏడాది జనవరి 31 నుంచి మార్చి 26 వరకు దాదాపు రెండు నెలలపాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచనున్నారు. మార్చి 28 నుంచి 31 వరకు రైతులు, వికలాంగులు, మహిళలకు ప్రత్యేక సందర్శన ఉంటుందన్నారు. రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న గార్డెన్స్‌ను సాధారణంగా మొఘల్ గార్డెన్స్ పేరుతో ప్రాచుర్యం పొందింది. జమ్ముకాశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్, తాజ్‌మహల్ వద్ద ఉన్న ఉద్యానం స్ఫూర్తిగా రాష్ట్రపతి భవన్‌లోని ఈ గార్డెన్‌ను ఆంగ్లేయుల కాలంలో తీర్చిదిద్దారు. అప్పటి నుంచి కూడా దీనిని మొఘల్ గార్డెన్స్‌గా ప్రజలు పిలుస్తున్నారు. దీనిని ప్రతీ ఏటా వసంతకాలంలో సాధారణ ప్రజల సందర్శనార్థం 'ఉద్యానోత్సవం' పేరుతో తెరుస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న 'అమృత్ మహోత్సవ్' థీమ్‌కు అనుగుణంగా గార్డెన్స్ పేరును 'అమృత్ ఉద్యాన్'గా మార్చినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇప్పటికే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా కేంద్రం ఇప్పటికే మార్చివేసింది.