- రాష్ట్రపతి ప్రసంగం నిరాశపరిచింది - సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చాలా నిరాశపరిచిందని అన్నారు. ''రాష్ట్రపతి ప్రసంగం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ బుజ్జగింపు విధానాల కథనం తప్ప మరేమీ కాదు. 19 పేజీల ప్రసంగంలో కార్మికుడు అనే పదాల ప్రస్తావన లేదు. ఇందులో మన భారతదేశంలోని వ్యవసాయ రంగం గురించి ఏమీ ప్రస్తావించ లేదు. దేశంలోని అణగారినప్రజలతో కేంద్ర ప్రభుత్వం నిలబడదనే వాస్తవాన్ని ఇది సమర్థిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రపతి ప్రసంగంలో భాగం కాకపోవడం బాధాకరం'' అని అన్నారు. ''వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నామని రాష్ట్రపతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే గవర్నర్ల రాజ్యాంగ విరుద్ధమైన జోక్యాలను మరిచారు. కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆదేశాన్ని తుంగలో తొక్కి దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి కుట్రలను చూడడం లేదు'' అని విమర్శించారు. ''మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న జోక్యాలను ప్రశంసిస్తూ ప్రసంగంలో పేర్కొన్న అనేక ప్రాజెక్టులు నిజానికి సామాన్యులకు ఏ విధంగానూ ఉపయోగపడని ప్రకటనలు మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను అమ్మేసే విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం దేశాన్ని ఎలా ప్రగతిపథంలో నడిపిస్తుంది?'' అని ప్రశ్నించారు.