- కాషాయ పార్టీ నుంచి ప్రజాసంఘాల్లోకి వలసలు అగర్తల : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్నది. సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న సభలకు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజానీకం హాజరవుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నుంచి సీపీఐ(ఎం) ప్రజా సంఘాల్లోకి చేరికలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. యువరాజ్ నగర్ లజ్‌నందతల్‌లో బీజేపీ నాయకులు సీపీఐ(ఎం) ప్రజాసంఘాల్లో చేరారు. కళ్యాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి మనింద్రా చంద్ర దాస్ విజయం కోరుతూ భారీ ర్యాలీ జరిగింది. ఎర్ర జెండాలతో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. యువరాజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థి షైలీంద్ర చంద్ర దేవ్‌నాథ్ విజయాన్ని కోరుతూ రామ్‌నగర్‌లో నిర్వహించిన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో పాణిసాగర్‌కు చెందిన బీజేపీ నాయకులు సీపీఐ(ఎం)లో చేరారు. బగ్మా నియోజవర్గం లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థి నరేష్ జమాతియా విజయాన్ని కోరుతూ ఫిత్రాని ఫోటమతి ప్రాంతంలో భారీ ప్రదర్శన జరిగింది. త్రిపురలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఐక్యంగా ప్రజానీకం కదలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. మాను నియోజవర్గంలో లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థి ప్రభాత్ చౌదరి విజయాన్ని కోరుతూ జరిగిన బంకుల్ మార్చ్‌లో వేలాది మంది ప్రజలు భాగస్వామ్యమయ్యారు. రెడ్‌ఝందతల్‌లోని రైసబరియాలో బీజేపీకి చెందిన కార్యకర్తలు సీపీఐ(ఎం) ప్రజాసంఘాల్లో చేరారు.