సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లూనా ప్రాంతంలో జాతీయ రహదారి 154ఎ మార్గంలోని వంతెనపై ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది. చంబా-భర్మూర్ జాతీయ రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. చంబా జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. కొండచరియలు విరిగిపడటంతో 20 మీటర్ల పొడవైన బ్రిడ్జి కూలిందని చంబా డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఒక కారు, లారీ లోయలో పడినట్లు చెప్పారు. వంతెన కూలడంతో జాతీయ రహదారి కనెక్టవిటీ పూర్తిగా దెబ్బతిన్నదని వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలైంది.