- తొలి మహిళగా రికార్డు న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలిగా పిటి ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు ఆఖరు తేదీ ఆదివారం కాగా... పిటి ఉష ఒక్కరే ఈ దరఖాస్తు చేసుకోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ఉమేష్ సిన్హా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఉపాధ్యక్ష, జాయింట్ సెక్రటరీతోపాటు మొత్తం 12 పదవులకోసం 24మంది దరఖాస్తు చేసుకున్నారని, డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నట్లు రిటర్నింగ్ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో 95ఏళ్ల ఐఓఏ చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళా అథ్లెట్‌గా పిటి ఉష రికార్డు నెలకొల్పారు. 58ఏళ్ల పిటి ఉష ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో సహా 1984 ఒలింపిక్స్ 400మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకొన్నారు. అన్ని జాతీయ సమాఖ్యల మద్దతుతో పిటి ఉష శనివారం ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.