- ఎస్వీకే నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు 'జర్నలిస్టుల మహాప్రదర్శన' నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభ ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించే ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పత్రికల సంపాద కులు, మీడియా ఛానెళ్ల సీఈవోలు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) నుంచి జర్నలిస్టుల మహా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కళా బృందాల ప్రదర్శనలు కూడా ఉంటాయని వివరించారు. ఈ మహాసభకు అన్ని జిల్లాల నుంచి దాదాపు రెండు వేల మంది జర్నలిస్టులు పాల్గొం టారని తెలిపారు. ఈ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ఆధ్వర్యంలో జరుగుతున్నా యని పేర్కొన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల మొదటి ట్రేడ్ యూనియన్‌గా ఏర్పడిన ఫెడరేషన్ పన్నెండేం డ్లుగా వారి సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తున్నదని వివరించారు. ఈ మహాసభలో గత కార్యక్రమాలను సమీక్షించి, జర్నలిస్టుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిచడం జరుగుతుందని తెలిపారు.