నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ శాంతియుతంగా రాజ్ భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమనీ, నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలనీ, వ్యవసాయ ధరలు నిర్ణయించే కమిటీలో రైతుల ప్రాతినిధ్యం ఉండాలనీ, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలనీ, సన్న, చిన్న, మధ్యతరగతి రైతులకు రూ.5వేలు పెన్షన్ ఇవ్వాలనీ, వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం తెలంగాణలో శాంతియుతంగా రాజ్ భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన రైతులను అడ్డుకోవడం తగదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించేంత వరకు రైతులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని కూనంనేని తెలిపారు.