- టీడబ్ల్యూజేఎఫ్ మహాసభకు తరలిరానున్న జర్నలిస్టులు నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ నిరంతరం ప్రజా సమస్యలపై తమ కలాన్ని విదిల్చే పాత్రికేయులు ఆదివారం హైదరాబాద్‌లో కదం తొక్కనున్నారు. అనేక ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ల సాధన కోసం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకూ వారు మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర రెండో మహాసభ ఆదివారం స్థానిక ఆర్టీసీ కళాభవన్ (బాగ్‌లింగంపల్లి)లో జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు మహా ప్రదర్శన ప్రారంభమవుతుంది. అనంతరం పతాకావిష్కరణతో మహాసభను లాంఛనంగా ఆరంభిస్తారు. ఆ తర్వాత ముఖ్య వక్తల ప్రసంగాలు కొనసాగుతాయి. అనంతరం కార్యకలాపాల నివేదిక, దానిపై సమీక్ష ఉంటాయి. ఆ తర్వాత మహాసభకు హాజరైన ప్రతినిధులు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటారు. ఆ తర్వాత నూతన కమిటీని ఎన్నుకుంటారు. ఈ మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు.