నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర సీఐడీ డీజీపీ గోవింద్ సింగ్ బుధవారం పదవీ విరమణ చేశారు. దాదాపు 32 సంవత్సరాల పాటు రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హౌదాల్లో బాధ్యతలు నిర్వహించిన గోవింద్‌సింగ్.. 1990 బ్యాచ్‌కు చెందిన పోలీసు అధికారి. ఆయనకు డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ సర్వీసు కాలంలో నిర్వహించిన ఉత్తమ విధుల కారణంగా ఇటు పోలీసు శాఖలోనూ.. అటు ప్రజల్లోనూ గోవింద్‌సింగ్ గుర్తుండిపోయే అధికారి అని కొనియాడారు. సీఐడీ విభాగంలో గత ఐదేండ్లుగా పేరుకుపోయిన అనేక కేసులను ఆయన పరిష్కరించగలిగారని అన్నారు. ముఖ్యంగా, ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లో పని చేసిన అనుభవంతో రాష్ట్ర పోలీసు శాఖలో పనితీరును సైతం అంతర్జాతీయస్థాయి నాణ్యతలను సమకూర్చటానికి కృషి చేశారని ఆయన తెలిపారు. గోవింద్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖ వంటి అత్యుత్తమ శాఖలో పని చేయటం తనకు గర్వకారణమన్నారు. తాను విధి నిర్వహణలో సంతృప్తిగా పదవీవిరమణ చేస్తున్నానని ఆయన చెప్పారు.