- ఫిబ్రవరి 2 నుంచి చేయాలంటూ సూచన నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం నుంచి ప్రారంభించే ప్రజాప్రస్థానం పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతిని నిరాకరించారు. వచ్చేనెల రెండో తేదీ నుంచి చేపట్టాలంటూ 15 షరతులతో కూడిన అనుమతినిచ్చారు. దీంతో ప్రజాప్రస్థానం పాదయాత్ర వచ్చేనెల రెండో తేదీన నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తాండా నుంచి పున:ప్రారంభమవుతుందని షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 3,512 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయ్యిందని వివరించారు. నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకునేలా సాగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందనీ, అనంతరం పాలేరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టేలా రూట్‌మ్యాప్ తయారు చేశామని తెలిపారు. వచ్చేనెల మూడో వారంలో అదే నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ పాలనకు అంతిమయాత్ర అని విమర్శించారు. తమ గొంతు నొక్కేందుకు 15 షరతులు విధించారనీ, అయినా ప్రజా సమస్యలను తెలుసుకోవడమే తమ కర్తవ్యమని తెలిపారు.