- యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరు కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉందని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంపన్నులకు అనేక రాయితీలు కల్పిస్తూ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలపై పన్నుల భారాలు మోపే విధంగా పద్దును రూపొందించారని తెలిపారు. విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమం, యువజన రంగాలకు అతి స్వల్పంగా కేటాయించడం శోచనీయమని పేర్కొన్నారు.