- ఈనెల13న హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారి దిగ్బంధనం : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నవతెలంగాణ- జగిత్యాలటౌన్ బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొస్తామని 2013 ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ సమక్షంలో మాట ఇచ్చి పదేండ్ల్లు గడుస్తున్నా నేటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాని మోడీ రాష్ట్రానికి ఫిబ్రవరి 13న వస్తున్నాడన్న సమాచారం మేరకు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తున్నట్టు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ కోసం పెట్టిన సమావేశాలకు హాజరైన బీజేపీ నాయకులు ఓవైపు వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే ఇప్పటివరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టకుండా మోసం చేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమ ఆగ్రహాన్ని బీజేపీ చవి చూడక తప్పదని హెచ్చరించారు. బీజేపీని ఓడించేందుకు ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలోని అనాధలను ఆదుకుంటామని, అనాథల కోసం దేశం గర్వించే విధంగా ఒక పథకాన్ని రూపొందిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా అనాథల కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.