- మంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ వీఆర్‌ఏల సమస్య సీఎం కేసీఆర్ దృష్టిలో ఉందనీ, త్వరలోనే వారికి ఆయన శుభవార్త చెప్తారని మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసం వద్ద హరీశ్‌రావును వీఆర్‌ఏ జేఏసీ కో-చైర్మెన్ రమేశ్ బహదూర్, ప్రధాన కార్యదర్శి దాదేమియా, కో-కన్వీనర్లు మాధవనాయుడు, రఫీ, రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వర్‌రావు, రాజు, తదితరులు కలిశారు. సోమవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ద్వారానైనా వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పేస్కేలును వర్తింపజేయాలని విన్నవించారు. ప్రమోషన్లు, వారసత్వ ఉద్యోగాలు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు, తదితర హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్‌ఏలకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీనిచ్చారు.