నవతెలంగాణ-కోటపల్లి క్వింటాల్ పత్తికి కనీస మద్దతు ధర రూ.12000 కల్పించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో జరిగిన ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఏర్మ పున్నం మద్దతు తెలిపి మాట్లాడారు. రైతులు అరుగాలం కష్టపడి పండించిన పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర కల్పించటం లేదని విమర్శించారు. గడిచిన 2 రోజుల్లోనే పత్తి ధర రూ.1000 పడిపో యిందని,పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఫిబ్ర వరి 10వ తేదీన జరిగే కలెక్టర్ ముట్టడిలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు గోమాస రాజబాబు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోర్తే సమ్మయ్య, ఎర్మ బోడ్డయ్య, రైతులు పాల్గొన్నారు.