- మొరాలిటీ పోలీసు విభాగాన్ని రద్దు చేస్తాం: ఇరాన్ అటార్నీ జనరల్ టెహరాన్ : దేశ మొరాలిటీ పోలీసు విభాగాన్ని రద్దు చేయనున్నట్టు ఇరాన్ అటార్నీ జనరల్ ప్రకటించారు. పైగా మొరాలిటీ పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరీ వ్యాఖ్యానించినట్టు మీడియా వార్తలు ఆదివారం తెలిపాయి. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారిగా దేశంలో కనివినీ ఎరుగని రీతిలో హిజాబ్ నిరసనలు తలెత్తిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అయితే కొత్త పేరుతో లేదా కొత్త నిబంధనలతో ఈ బలగాలను తిరిగి ఏర్పాటు చేస్తారా లేదా అనేది తెలియరాలేదు. కానీ 'నైతిక' నేరాలకు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలు, మరణ శిక్షలు కొనసాగుతాయని ప్రభుత్వ వార్తా సంస్థలు తెలిపాయి. కాగా, ఈ నిర్ణయాన్ని కాస్త పరిశీలనా దృక్పథంతో చూడాల్సి వుందని ససెక్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల సీనియర్ లెక్చరర్ కమ్రాన్ మాటిన్ వ్యాఖ్యానించారు.