- న్యాయవ్యవస్థలో మార్పులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు - టెల్ అవీవ్‌లో లక్షలాది మందితో ప్రదర్శనలు టెల్ అవివ్ : ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన అనంతరం బెంజమిన్ నెతన్యాహు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో మార్పులకు యోచిస్తున్న ఆయన ప్రయత్నాలపై ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. న్యాయవ్యవస్థలో మార్పులు ఆ దేశ సుప్రీంకోర్టును బలహీనపర్చేదిగా ఆరోపిస్తూ ఆ దేశ రాజధాని టెల్ అవీవ్‌లో లక్షలాది మంది నిరసనలో పాల్గొన్నారు. నిరసనల్లో పాల్గొన్నవారు లక్ష మందికి పైగానే ఉంటారని ఇజ్రాయిల్ దేశ మీడియా తెలిపింది. ''మా పిల్లలు నియంతృత్వంలో జీవించలేరు'' అని నిరసనకారులు బ్యానర్లు, ఆ దేశ జెండాలను ప్రదర్శించారు. నెతన్యాహు అతిజాతీయవాద, అతిసనాతన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గతవారంలోనూ వేలాది మంది ప్రజలు నిరసనలు చేసిన విషయం తెలిసిందే. నెతన్యాహు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలతో పాటు లాయర్లు, పౌర హక్కుల కార్యకర్తల నుంచి వ్యతిరేకతను తీసుకొచ్చింది. ''వారు మమ్మల్ని నియంతృత్వంలోకి మార్చాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనుకుంటున్నారు. న్యాయవ్యవస్థ అధికారాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. న్యాయపరమైన అధికారం లేకుండా ప్రజాస్వామ్య దేశం లేదు'' అని ఇజ్రాయెల్ బార్ అసోసియేషన్ హెడ్ అవీ చిమి అన్నారు. కాగా, ఇజ్రాయిల్ దేశంలో కొనసాగుతున్న నిరసనలు మూడో వారానికి చేరుకు న్నాయి. ఈ నిరసనలను నెతన్యాహు తోసిపుచ్చారు. అవినీతి ఆరోపణల విషయంలో ప్రధానమంత్రి విచారణను ఎదుర్కొ ంటున్న విషయం విదితమే. ఇలాంటి తరుణంలో న్యాయవ్యవస్థలో మార్పులకు నెతన్యాహు పూనుకోవడం గమనార్హం.