సి.నా.రే గేయకవి, గొప్ప సాహితీవేత్త, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత. ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఎన్నదగినది. ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్‌ను ఆకళింపు చేసుకొని తెలుగులో గజల్స్ రాశారు. సినిమా పాటలు రాశారు. కవిత్వాన్ని, వచనాన్ని అన్నింటిని సుసంపన్నం చేశారు. సాహిత్యంలో కొత్త ప్రయోగాలు చేసే కవిగా సినారెను చెప్పుకోవచ్చు. ఆ ప్రయోగాల పరంపరలలో బయటపడ్డవే ఈ ప్రపంచపదులు. రుబాయికి ప్రపంచపదులకు పోలిక మనం సాధారణంగా ప్రపంచపదులను గమనిస్తే మాత్రా ఛందస్సును కలిగియుంటుంది. రుబాయి +1 గా కనిపిస్తుంది. రెండింటిలోను అంత్యప్రాస కీలకం, కానీ అందులో నాలుగు పాదాలుంటాయి. ఇందులో ఐదు పాదాలు ఉంటాయి. రెండింటిలోను మూడవ పాదం మిగిలిన పాదాలను తూకం వేసేదిగా ఉంటుంది. మూడవపాదం నిరలంకారంగా, సాధారణంగా, అంత్యప్రాస లేకుండా ఉంటుంది. ప్రపంచపదుల వివరణ ప్రపంచపదులు అనగా విశేషమైన పంచపదులు లేదా గొప్పవైన పంచపదులు అనే అర్థం వస్తుంది. ప్రపంచ అనే పదాన్ని కలుపుకుంటే లోక తీరును తెలియజెప్పే ప్రపంచ పదులుగా చెప్పవచ్చు. సినారే ఈ ప్రపంచ పదులలో మనిషితనాన్ని చూపించాడు. మనిషిని మనిషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేశారు. లోకంలోని పోకడలను వ్యంగ్యంగా, సూటిగాస్పష్టంగా తెలియజేశాడు. ఈ ప్రపంచపదులలో సినారే మాత్రా ఛందస్సును వాడారు. అంతేకాకుండా దీని నిర్మాణశైలిని ఒక్కసారి గమనిస్తే 1.అంత్యప్రాస 2.అంతఃప్రాస 3.పదవిరామాలు గా కనిపిస్తుంది. సినారే ప్రపంచపదులు రాయటంలో వస్తువుగా ప్రపంచాన్నే ఎంపిక చేసుకున్నాడు. ఐదుపాదాలలో తను చెప్పే విషయం పాఠకుల మెదళ్ళలో ఒక మెరుపు మెరుస్తుంది. మరియు సినారే వీటిని లయబద్దంగా పాడటం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. సినారే రాసిన కొన్ని ప్రపంచపదులను గమనిస్తే... ''నింగిలోతును చూడగోరితే నీటిచుక్కను కలుసుకో రత్నతత్వం చూడగోరితే రాతిముక్కను కలుసుకో అణువునడిగితే తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో మౌనశిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో మనిషిమూలం చూడగోరితే మట్టిబెడ్డను కలుసుకో'' ఈ ఐదు పాదాల ప్రపంచ పదిని ఎందులోకి అన్వయించుకుంటే ఆ అర్థాన్నిస్తుంది. జీవన సారాన్ని కాచి వడగట్టి పట్టిచ్చినట్టుగా ఉంటాయి ఈ ప్రపంచపదులు.. కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది చెక్కనిదే శిల కడుపున శిల్పమెలా పుడుతుంది ఫలితం అందేది తీవ్రపరిణామం లోనే సుమా మరగనిదే నీరు ఎలా మబ్బురూపు కడుతుంది నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ కషిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని తెలియజెప్పుతూ ప్రేరణనిస్తూ రాసిన ఈ ప్రపంచ పదిని ఆచరణలో పెడితే ఎవ్వరమైనా జీవితాన్ని గెలవవచ్చు. ఇంకోక ప్రేరణా ప్రపంచపది.. ఏ రాపిడిలేకుండా వజ్రమెలా మెరుస్తుంది ఏ అలజడిలేకుండా సంద్రమెలా నిలుస్తుంది నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సష్టి ఏ ప్రేరణలేకుండా నాదమెలా పలుకుతుంది ఏ స్పందన లేకుండా హదయమెలా బతుకుతుంది.. చివరగా.. ప్రపంచపదుల ఆవశ్యకతను గూర్చి సినారే గారు కూర్చిన ప్రపంచపది.. విరిగిపడిన జాతికి వెనుచరుపులీ ప్రపంచపదులు మరుగుపడిన నీతికి కనుమెరుపులీ ప్రపంచపదులు చేదో తీపో మదించి చెప్పాడు సుమా సినారే కునుకే అడుగులకు మేలుకొలుపులీ ప్రపంచపదులు మారే విలువలకు దారిమలుపులీ ప్రపంచపదులు ఇలా లోకంలో జరిగే అవినీతిపై, అక్రమాలపై దండెత్తిన పదునైన పదులుగా ఈ ప్రపంచపదులను చెప్పుకోవచ్చు. - తండ హరీష్ గౌడ్ సెల్: 8978439551