Sat 25 Mar 21:44:47.1147 2023
Authorization
అడవి జంతువులన్నీ మృగరాజు సింహం అధ్యక్షత సమావేశం అయ్యాయి. ముందుగా సింహం ''మనం ఎందుకు సమావేశమైందీ మీకు తెలుసు. అడవికి మగరాజుగా నేనున్నాను. అడవి రక్షణ బాధ్యతల నిర్వహణకు మంత్రిని నియమించే విషయంలో మీ అభిప్రాయం కోసం సమావేశం ఏర్పాటు చేశాను. మీ సమస్యలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించగలిగే వారినే మంత్రిగా ఎన్నుకోండి. స్వతంత్రంగా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి. మీకు నచ్చిన వారిని మంత్రిగా నియమిస్తాను. అడవి జంతువుల సమస్యలు తెలిసిన వారు, అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వారు, పక్షులకు, చిన్న జంతువులకు అండగా నిలబడేవారు పోటీలో నిలబడవచ్చు'' అంటూ సింహం ముగించింది.
సమావేశానికి హాజరైన జంతువుల్లో ఉత్కంఠ నెలకొంది. కొన్ని జంతువులకు పోటీ చేయాలని ఉన్నా ధైర్యం చాలటం లేదు. మరి కొన్నింటికి పోటీ చేయాలని ఉన్నా సమర్థించే వారు లేక మిన్నకున్నాయి. పక్షులు మాత్రం మంత్రి పదవి తమకు అందని ద్రాక్షేనని నిట్టూర్చాయి. చిన్నజంతువులు పోటీలో నిలబడేందుకు ధైర్యం చాలక కూర్చుంటున్నాయి. చివరకు మంత్రి పదవికి పోటీ పెరిగింది. పెద్ద జంతువులు ఒక వర్గం, చిన్న జంతువులు, పక్షులు మరో వర్గంగా ఏర్పడ్డాయి. పెద్ద జంతువులు మంత్రి పదవికి తమ అభ్యర్థిగా పులిని నిలబెట్టాయి. పులి లేచి నిలబడి మగరాజుకు నమస్కరిస్తూ పోటీలో ఉన్నట్లు తెలిపింది. పులి పోటీలో ఉందని తెలుసుకున్న చిన్న జంతువులకు భయంతో గజగజ వణికిపోయాయి. తమను నిత్యం వేటాడే పులి 'మంత్రి అయితే... చావును ఆహ్వానించడమే' ఆ విషయాన్ని ఊహించుకుంటేనే వాటికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. మగరాజుకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఒక కుందేలు తన తోటి చిన్న జంతువుల పరిస్థితిని అర్థం చేసుకుని, పులికి పోటీగా నిలబడుతున్నట్లు ప్రకటించింది. కుందేలు ప్రకటన విన్న చిన్న జంతువులు కుందేలుతో నీకు బుద్ధుందా? పులితో పోటీ పడతావా? బతకాలని ఆశ లేదా? అని ఆగ్రహించాయి. దానికి కుందేలు మీరంతా ముందుగా నన్ను క్షమించాలి. మంత్రిగా ఏ పెద్దజంతువున్నా మొదట ఆహారమయ్యోది మనమే. నేను గెలిస్తే పులే కాదు మిగతా క్రూరజంతువుల నుంచి ప్రాణహాని ఉండదు. ఓడితే చావు మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నది. మగరాజు సింహం దూరంగా కూర్చొని చిన్న జంతువుల పరిస్థితిని అర్థం చేసుకుని జాలి పడింది. పులి క్రూర స్వభావం తెలియంది కాదు. నిత్యం చిన్న జంతువులను వేటాడే పులి మంత్రయితే వాటిని బతకనిస్తుందా! మగరాజునైనా ధర్మం తప్పకూడదు. పులి కారణంగా ఏ చిన్న జంతువుకూ అపకారం కలగకూడదు. మంత్రి అయ్యేవాడు ఆకారంలో కాదు, ఆలోచనలో పెద్దగా ఉండాలి. అందరి బాగోగులు కోరాలనుకుని లేచి నిలబడి, పులికీ, కుందేలుకీ అభినందనలు తెలిపి వారికి ఒక నిబంధన పెట్టింది. మంత్రి పదవికి పోటీలో నిలబడే వారు రోజులో చిన్నా పెద్దా జంతువులలో ఎవరు ఎక్కువ మందిని కలుస్తారో వారే విజేతలు. రేపు సాయంత్రం మళ్లీ కలుసుకుందాం అని సింహం వెళ్లిపోయింది.
మర్నాడు పులి ఉదయాన్నే నిద్రలేచి జంతువులను కలవటానికి బయలుదేరింది. ఆ సమయంలో పులికి బాగా ఆకలి వేయసాగింది. మంత్రయితే ఏ జంతువు నైనా వేటాడచ్చు. ఈ ఒక్కరోజు ఆకలికి ఓర్చుకోవాలి. ముందు జంతువులను కలిసి మంత్రి పదవి కొట్టేయాలి అనుకొని నడవసాగింది. ఆకలి మీదున్న పులిని చూడగానే చిన్న, పెద్ద జంతువులు భయపడ్డాయి. పులి పరిస్థితి మిగతా జంతువులకు అర్థమైంది. ఈ సమయంలో పులికి కనపడితే చంపక మానదని గ్రహించాయి. స్థావరాల నుంచి పులి ముందుకు రాలేదు. పులి నిరాశగా సింహం దగ్గరకు బయలుదేరింది. కుందేలు ఆలస్యంగా నిద్ర లేచింది. ముందుగా దుంపలు తిని జంతువులను కలవటానికి బయలుదేరింది. చిన్న జంతువులు ఎదురొచ్చి కుందేలును కలిశాయి. తర్వాత పెద్ద జంతువులను కలిసేందుకు వాటి స్థావరాలకు వెళ్లింది. పెద్ద జంతువులు కుందేలు చూడగానే స్వయంగా బయటకు వచ్చాయి. వాటి పిల్లలు కుందేలుతో ఆడుకున్నాయి. అందరినీ కలిశాక కుందేలు సింహం దగ్గరకు బయలుదేరింది. గుహలో సింహం పక్కన పులి నిలబడి ఉంది. కుందేలు వెళ్లి సింహాన్ని కలిసింది. ఇద్దరూ ఎంతమందిని కలిశారని సింహం ప్రశ్నించింది. పులి సిగ్గుతో తల దించుకోగా, కుందేలు కలిసిన వారి వివరాలు తెలియజేసింది. మిగతా జంతువులన్నీ కూడా గుహకు చేరుకున్నాయి. సింహం జంతువులను ఉద్దేశించి ''ఎవరైనా మగరాజుకు చెప్పలేనివి మంత్రికి విన్నవించుకుంటారు. ఆ మంత్రినే చూసి భయపడితే, వారి సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు? మంత్రి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. కుందేలు అదే పని చేసింది. చిన్నదైనా అందరినీ కలిసింది. చిన్నాపెద్దా జంతువులను పలకరించింది. వారి పిల్లలతో సరదాగా గడిపింది. అందరి అభిమానం చూరగొన్న కుందేలును మంత్రిగా ప్రకటిస్తున్నా అన్నది. చిన్నజీవుల ఆనందంతో ఎగిరి గంతేశాయి. కుందేలును అభినందించాయి. చిన్నజీవుల కళ్లలో ఆనందం చూసిన సింహం చిరునవ్వుతో గుహ లోనికి బయలుదేరింది.
- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100