Sun 04 Apr 00:06:12.611743 2021
Authorization
ఏదైనా పెరుగుతుండడం అంటే మంచిదే అనుకుంటాము. ఇది దిగజారడంలో పెరగడం. అంటే ముందుకు పోవాల్సింది వెనక్కి వెనక్కి పడిపోతున్నాం. స్త్రీ పురుషుల మధ్య అసమానత మరింత పెరిగిపోతుండటం సామాజికులకు ఆందోళన కలిగించే అంశం. ఈ అసమానతలు తీవ్రమైన సామాజిక సమస్యలకు కారణంగా మారుతాయి. స్త్రీ పురుష సంఖ్యా నిష్పత్తి కూడా చాలా తేడాలున్నాయి. అసమానతలు ఆధునిక కాలంలో తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి.
ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల మధ్య అంతరం అరవైరెండు శాతంగా నమోదయింది. మొత్తం నూటాయాభై ఆరు దేశాల్లో మన దేశస్థానం 140వ స్థానంగా నిలిచింది. గత యేడాది అంటే 2019తో పోల్చితే 2020లో 28 స్థానాలు దిగజారి, తిరోగమనంలో పెరుగుదల కనపరచింది. ఇక దక్షిణాసియా దేశాలయిన బంగ్లాదేశ్, నేపాల్ భూటాన్, శ్రీలంకలు మన కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక విషయాలకు వస్తే పురుషులు సంపా దించే ఆదాయంలో అయిదింట ఒక వంతు మాత్రమే స్త్రీలు పొందగల్గుతున్నారు. ఆర్థిక విషయాలతో తీవ్ర అంతరం కనపడుతోందని నివేదిక తెలిపింది. ఇక రాజకీయాలలో 2019లో 23.1 శాతంగా ఉన్న మహిళా మంత్రులు, 2020 సంవత్సరాల్లో 9.1 శాతానికి పడిపోయింది. మహిళా కార్మిక శాతం కూడా పడిపోయింది. పురుషుల్లో నిరక్షరాస్యత 17 శాతం ఉంటే, స్త్రీల నిరక్షరాస్యత 34 శాతంగా వుంది. ఆరోగ్యం, రాజకీయ సాధికారతలో భారత్ ఇంతగా దిగజారటాన్ని నివేదిక తేటతెల్లం చేసింది.
ఇవి కేవలం లెక్కలు మాత్రమే కాదు. మన దృక్పథానికి సంబంధించిన పర్యవసానపు ఫలితాలు. ఈ లెక్కలు ఇంకా ఆదివాసి, దళిత, వెనుకబడిన వర్గాలకు సంబంధించి చూసినట్లయితే మరింత భయంకరంగా మనకు కపడుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థలో ఆధునిక భావాలతో అందరూ సమాన మనే రాజ్యాంగపు విలువల ఆధారంగా సమాజం ఎందుకు ఎదగలేక పోతోంది. మనం చదువుకునేవి రాసుకున్నవి ఆచరణలో భిన్నంగా ఎందుకు కనపడుతున్నవనేది తలెత్తాల్సిన ప్రశ్న.
సమాజంలో స్త్రీ పురుష సమానత విషయంలో అనేకంగా భూస్వామిక భావాజాలంలోనే కొనసాగుతున్నాయి. అందుకు తోడుగా కేంద్రంలో మను వాద ఆలోచనలు కలిగిన వారు అధికారంలోకి వచ్చాక మహిళల పరిస్థితులు మరింత దిగజారాయి. స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితమయి ఉండాలని, పురుషులకు సేవ చేయటానికి, పిల్లల్ని కనిపెంచటానికి మాత్రమే పరిమితమవ్వాలనే వివక్షాపూరిత ఆలోచనలను బహిరంగంగానే వెలి బుచ్చుతున్న నేతల పాలనలో ఇంత కంటే మంచి ఫలితాలను మనం చూడ లేము. అసలు అన్యాయాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురయ్యే వారిని రక్షించడానికి మేము లేమని నిస్సిగ్గుగా చెబుతున్నారంటే, వారి అంధయుగపు ఆలోచన ఎలా వుందో అవగతమౌతుంది. వీళ్ళ ప్రభావ కారణంగానే మహిళల స్థితిగతులు మరింత దిగజారాయి.
ఇంకో రెండోవైపు మొత్తంగానే సమాజంలో ఆర్థిక పరమైన అంతరాలు పెరిగాయి. దారిద్య్రం, నిరుద్యోగిత, ఉపాధి లేమితనం పెరిగింది. సామాజిక పరమైన వివక్షతలూ పెరిగాయి. ఈ రకమైన అసమానతలు స్త్రీ పురుషుల అసమానతలనూ పెంచింది. 'వందేళ్ళ క్రితం మహిళలు సాధించుకున్న హక్కులకు నేడు ముప్పు వాటిల్లుతున్నదని' సామాజక విశ్లేషకులు చెప్పిన విషయం ఎంత వాస్తవమైందో అర్థమవుతుంది. అందుకే మహిళలు చైతన్య వంతమై పోరాడాల్సిన అవసరాన్ని ఈ నివేదికాంశాలు గుర్తు చేస్తున్నాయి.