మనమంతా హిందువులం సింధూ నది బిందువులం రక్త బంధువులం హిందువుగా జీవించు హిందువుగా గర్వించు అంటారే.... మరెందుకు? మా ఊరి గుడిలో మాకు చోటుండదు! మేమెట్లా గర్వించాలి?
దేశాధ్యక్షుడనైనా హిందువునైనా అంటరాని కులంలో పుట్టినందుకు ఆలయంలో అడుగు పెట్టనీయనందుకా? మేమెట్లా గర్వించాలి?
పొట్టకు బట్టకు నోయక అష్టకష్టాలు పడి అక్షరాన్ని నమ్ముకొని సమాజంలో ఖదరుగా బతుకాలని పట్టణానికొచ్చి ఇంటిని అద్దెకడిగితే అంటరానోడివని తిరస్కరించినందుకా? మేమెట్లా గర్వించాలి?
మా ఎల్లమ్మ, బాలమ్మ, పిండమ్మ, వీరనాగమ్మ, పోశమ్మ, మైసమ్మ, నాంచారమ్మ ల బీరప్ప, మల్లయ్య, కాటమయ్యల పండుగలకు మీరు రారైతిరి... మంత్రాలు చదువరైతిరి... మమ్ములను.. మా ఆరాధ్యులను గుర్తించనందుకా? మేమెట్లా గర్వించాలి?
మేము హిందువులమైతే.... మాలో రాముడు, కష్ణుడు,శివుడు కొలువై ఉండాలి మరెందుకో... మాకు ప్రత్యేక దేవతలున్నారు! మా ఆపదలు వారికే తెలుసు మా మొక్కులు వారికే చెల్లును!
గోహత్య మహాపాపం పరువుహత్య మహాపుణ్యం గోమాంస భక్షణ అధర్మం మాతో కలిసి తినకపోవడం ధర్మం గోపంచక సేవనం పవిత్రం మేము తాకిన నీరు అపవిత్రం గృహంలో గోవు అడుగిడితే శుభం గుడిలో మేము అడుగిడితే అశుభం మనిషి తాకితే మైలపడడం విచిత్రం! మేమెట్లా గర్వించాలి?మేమెట్లా గర్వించాలి?