Sun 18 Apr 00:38:48.85678 2021
Authorization
'ముసలివాణ్ణి కాదు నేను అసలు వాణ్ణి, ఆకాశాన్నందుకున్న కొసలవాణ్ణి' అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పుకున్నాడు. ముసలితనం, ముసలివాళ్ళను మనం ఎలా చూస్తున్నాము అనే దాన్ని బట్టి మన సామాజిక విలువలు, మానవ సంబంధాలు ఎలా వున్నాయో చెప్పవచ్చు. ముసలితనం అనేది అందరికీ ఎదురయ్యే దశనే. వయసు మీరకముందే మరణం సంభవిస్తే తప్ప, ప్రతివారూ ఆ దశలో ఎదురయ్యే సమస్యలనీ, సవాళ్ళనీ ఎదుర్కొంటూనే వుంటారు.
ముసలితనాన్ని బాల్యంతో పోలుస్తారు. అంటే వయసు పెరిగేకొద్దీ బాల్యపు స్థితిలోకి వెళ్ళిపోతారని అర్థం. అట్లాంటి మానసిక శారీరక పరస్థితులు ఏర్పడినపుడు వాళ్ళకు కావలసిన ఏర్పాట్లను, సౌకర్యాలను చూసేందుకు కుటుంబం బాధ్యత తీసుకోవలసి వుంటుంది. ముసలివాళ్ళకు కావాలసిన పనులను కూడా చేసుకోలేని ఆశక్తతలో వుంటారు. కాళ్లూ చేతులూ ఇంతక్రితంలా కదలవు. జ్ఞాపకశక్తి కూడా లోపిస్తుంది. యవ్వనంలో ఎంతో ఉత్సాహంగా చేసిన పనులు మాట్లాడిన తీరు వయసు పైబడ్డాక సాధ్యం కాదు. అయితే వయసులో వున్నపుడు కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడి, శ్రమ చేసి శక్తినంతా ఖర్చు చేస్తారు. ప్రజా సేవకులైతే కాళ్లూ చేతులు ఆడినంత కాలం సమాజానికి అంకితమై పని చేస్తారు. మరి ఏళ్లు ముదిరి, కీళ్లు సడలి ముసలితనం ఆవహించగానే ఎవరికీ చెందని, పనికి రాని వ్యక్తులుగా మారిపోవడం చూస్తున్నాము. ఇది వ్యవస్థల దుర్మార్గం. కుటుంబ సంబంధాలలో నేటి వ్యవస్థ తెస్తున్న మార్పులు ముసలి వాళ్ళను మరింత వేదనకు గురి చేస్తున్నది.
మనలాంటి వ్యవస్తలయితే బాలలకూ, ముసలివాళ్ళకు బాధ్యత వహించగలుగుతున్నవి కుటుంబ పరిధిలోనే జరుగుతున్నది. కుటుంబాలలో కూడా నేక మార్పులొచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. అందరూ ఒకే చోట నివసించే కాలంలో పిల్లలకూ పెద్దలకూ పెద్దగా సమస్యలు తలెత్తేవికావు. ముసలివాళ్లు ముఖ్యంగా తమ బాల్యపు, యవ్వనపు జీవిత జ్ఞాపకాల్లో బతుకుతారు. అందులోనే వారికి స్వాంతన దొరుకుతుంది. తమ వాళ్లు, తాము తిరిగిన పరిసరాలు, మనుషులు మధ్య చివరి మజిలీ కొనసాగటమే వారు కోరుకుంటారు. తమ జ్ఞాపకాలను పంచుకోవటానికి ఎవరైనా ఉండాలనీ ఆశిస్తారు. అనుభవాలనన్నీ నెమరు వేసుకునే వాతావరణం వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
కానీ నేటి యువ తరానిది మరో సమస్య. భావి జీవనానికి సంబంధించిన ఒత్తిడి నేడు విపరీతంగా పెరిగిపోయింది. పని ప్రదేశాలలోనూ పని గంటల్లోనూ పెద్ద మార్పు వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప బతకలేని పరిస్థితులు, పిల్లల్ని కూడా కేర్ సెంటర్లలో నర్సరీ బడుల్లో దించేయడం, పరుగులతో కూడిన జీవనంతో ఇక పెద్దవాళ్ళను, వారి బాగోగులను చూసే పరిస్థితులను ఆవిరి చేసింది. ఈ రకమైన ఆర్థిక వొత్తిడితో, ఉపాధి లేమితో పెద్దల పట్ల, పిల్లల పట్ల బాధ్యతను నెరవేర్చలేకపోతున్నారు. ఇదొక పరిస్థితయితే వృద్ధులు ఇక ఎందుకూ పనికిరారనే ఆలోచనతో అనాథలను చేసి ఇంట్లోంచి వెళ్లగొడుతున్న సంఘటనల్ని చూస్తున్నాం. ఇదంతా వ్యవస్తలో వచ్చిన దుర్మార్గపు పెట్టుబడిదారీ లక్షణ ఫలితం. ఇది మనుషుల్ని సరుకులుగా మారుస్తుంది. మానవ సంబంధాలను సరుకు సంబంధాలుగా చేస్తుంది. అనుబంధాలు, ఆత్మీయులు బూటకంగా మారిపోతాయి. మానవీయత అడుగంటి పోతుంది.
ఈ క్రూర దుర్మార్గ వ్యవస్థ లక్షణాన్ని అర్థం చేసుకుని వృద్ధులకు సరైన గౌరవాన్ని, ఆదరాన్ని కలిగించే పనికి పూనుకోవాలి. వారి ఆలనా పాలనా, మానవీయతతో చూసుకోవాలి. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు కూడా కృషి చేయగలిగినపుడే, వారు ఆనందంగా జీవితపు చివరి మజిలీని దాటగలుగుతారు.