Sat 01 May 19:28:22.905597 2021
Authorization
వార్తల కోసం ఉదయాన్నే పత్రిక వెతుక్కోవడం సాధారణంగా మనకుండే అలవాటు. వార్తలు చదవడానికి ఎందుకంత ఉత్సాహాన్ని చూపిస్తమంటే, ప్రపంచం మాట్లాడుతుంది వార్తలో. ప్రపంచంతో మనకు వున్న సంబంధపు అనుబంధమే మనల్ని అటువైపుగా లాక్కెలుతుంది. వార్తయందు జగతి వర్థిల్లుతున్నదని ఒకనానుడి. సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కొనసాగుతాయి. అయితే అందరు మనుషులతో అది సాధ్యం కాదు. కానీ అందరితో సంబంధాలను నెరపగలిగిన వేదిక వార్తలు అందించే పత్రికతో మాత్రమే. ప్రపంచంలో జరిగే చిత్ర విచిత్రాలు కూడా చదివేందుకు ఆసక్తిని కలిగిస్తాయి. వార్తా నిర్వాహకులు కూడా ఆసక్తి గొలిపేటట్టుగా మన కందిస్తారు కూడా.
అయితే ఈ మధ్య వార్తా పత్రికను ఉదయం పట్టుకోవాలంటే భయం భయంగా వుంటోంది. ఎప్పుడు ఏ చావు కబురు కనపడుతుందో తెలవటం లేదు. మనుషులను కబలించే రోగాల వార్తలు, రోగపు తీవ్రతల పలు వర్ణనలతో ఉదయాన్నే గుబులు రేపే కథనాలనే చదవాల్సి వస్తోంది. వార్తలతో మానవుల అనుసంధానమేమోగాని, భయాలను, దుఃఖాలను అనుసంధానిస్తోంది వార్తా పత్రిక. అయితే వ్యాధులకు సంబంధించిన అనేక విషయాలను, విజ్ఞానాన్ని అందిస్తున్నప్పటికీ మన దేశపు నిర్లక్ష్య పర్యవసానంగా జరుగుతున్న ప్రాణనష్టం, దారుణమైన పరిస్థితుల వివరాలు మనసును బుగులుపుట్టిస్తోంది.
మనం చూస్తూ చూస్తూనే అయిన వాళ్ళను, స్నేహితులను, ప్రముఖులను, కళాకారులను, సామాజిక కార్యకర్తలను, ఉద్యమకారులను కోల్పోయే వార్తలు ఈ సంవత్సర కాలంగా చూస్తున్నట్లు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడంతా దుఃఖవార్తల కాలంగా మారిపోయింది.
'తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం! సెలవంటూ ఈ లోకాన్నీ వదలి.... అడుగడుగునా పొడసూపే, అనేకానేక శత్రువులతో పొంచి చీకట్లో కరవజూచే వంచకాల ఈ లోకంతో పొసగక వెళ్ళిపోయావా!' అంటూ శ్రీశ్రీలా పాడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాము. చావులు సాధారణమై పోతున్నవి. ఎవరు దుఃఖించారులే, నేస్తం నువు చనిపోతే, ఏదో నేనూ ఆరుగురు స్నేహితులూ తప్ప! అన్నట్లుగానే సాగిపోతోంది.
ఇక సెల్లులో ఫేస్బుక్ తెరవగానే ఎవరిదో ఫొటో కనపడుతుంది. ఈ సాయంత్రమే, గంట క్రితం అని మొదలవ్వగానే మరణ వార్త మదిలో దిగులు నింపుతుంది. జన్మదిన శుభాకాంక్షలకూ, మరణ వార్తలకూ మధ్య చదివే సమయంలోనే ఆందోళన గుండెల్లో మొదలవుతోంది. ఇప్పుడు సెల్లు తెరవాలన్నా భయంగానే వుంది, నిమిషాలలో వార్త ప్రపంచాన్ని చేరుతోంది. ఈ విపత్తు వార్తలను వినీ వినీ హృదయం మొద్దు బారిపోతుందో ఏమోనని అనుమానంగానూ వుంది. విపత్తు వార్తలు చదివి, వారి బాధలోనో, వారికి సహాయంగానో పాల్గొనే అవకాశమూ లేకపోవడమనేది ఒక విషాదం.
నిజంగా ఎంతో విషాదాన్ని, దుఃఖాన్ని నింపుతున్న వార్తలు, ప్రభుత్వాలను పరిపాలకులను కదిలించ లేక పోవటమే ఒక విచిత్రం. కోర్టులు, న్యాయమూర్తులు స్వయంగా కలుగ చేసుకుని మందలించినా కదలని తీరు వల్లా భయమేస్తోంది. ప్రకృతిలో కాలాలున్నట్లుగానే ఇప్పుడు పత్రికలు దుఃఖపు కాలాన్ని పట్టుకు వస్తోన్నది. కన్నీళ్ళ కాలం, ఆత్మీయులు, బంధువులు కనుమరుగవుతున్న కాలం. అందుకే వార్తలు వినాలన్నా, చదవాలన్నా భయం వేస్తోంది. చలించని పాషాణాలను చూస్తే మరింత భయం వేస్తోంది.