Sat 22 May 22:48:43.665802 2021
Authorization
ఓ... ప్రజా పాలికలారా....!
ప్రజాస్వామ్య పరిరక్షణలో మీ పాత్ర ఎంత...!
మీ పాలన ఎంత బేషుగ్గా ఉందో
మీకు మీరే భుజాలు చరుచుకుంటు
మీకు మీరే కితాబిచ్చుకుంటు
మాటల గారడీలతో మాయ చేస్తు
ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతూ
ప్రజా వాహినిని పక్కదారి పట్టిస్తు పసందు చేయండి
చప్పట్ల శబ్దానికి చచ్చిపోయే కరోనా
నిశ్శబ్దంగా యుద్ధమెలా చేస్తుంది
పల్లాలుమోగించి గో... కరోనా అంంటే
పారిపోయే కరోనా
మరణ మధంగం ఎలా మోగిస్తుంది
దీపాలు వెలిగిస్తే వెళ్ళిపోయే కరోనా
వేల దీపాలనేలా ఆర్పేస్తుంది
ఒక్క మందుగోలికి మాయమయ్యే మహమ్మారి
జీవాయుధమై చివాలున ఎలా లేస్తుంది
కోట్ల విరాలాలు ఏ కొండలెక్కాయి
కుంభకోణాల కుట్రలన్నీ
కుంభమేళాలలో కూర్చుకోండి
పాపాల పంకిలాన్నంతా
పుణ్య స్నానాలతో కడిగేసుకోండి
మందిరాలు నిర్మిస్తూ హౌమాలు చేస్తు
మారణహౌమాలకు శ్రీకారం చుట్టిండి
మూఢనమ్మకాలతో ముడుపులు కట్టి
అక్షర జ్ఞానాన్ని అంధకారంలోకి నెట్టి
విజ్ఞాన శాస్త్రాన్ని విసిరి పారేసి
మానవ మనుగడకే గండి కొట్టండి
ఇల్లు పిల్లలను వదిలి ప్రాణ భీతి మాని
ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నడుం బిగించి
ప్రాణాలుపోస్తు పహారాలు కాస్తు
చీకటిని ఊడ్చే చేతులకు అండగా
ఊతమిచ్చే ధాతలెందరు...!
ఓట్ల జాతరలో కోట్లు గుమ్మరిస్తూ
ఉచిత విద్యా వైద్యం గాలికి వదిలి
కార్పోరేట్ లతో కరచాలనాలు చేస్తు
శవాల గుట్టల కమురు వాసనతో
ధూపం వేసుకుంటూ....
చితిమంటలతో చలికాసుకుంటూ
వల్లకాటిలోని విభూది కుప్పలకు టెండర్లు పాడుతు
వ్యాపార రంగంలో వెలుగులు పూయించండి
రేపటి మీ వారసత్వ పీఠాలకు
పునాదులేస్తు పులకించిపోండి
ప్రజల ప్రాణాలతో పనేంటి మీకు
పోయేవి పోంగ మిగిలిన జీవాలు
ఓట్ల నాటికి జండాలు మోసే చేతులై నిలిచి
చూపుడు వేలుకు సిరాచుక్కలై మొలిచి
మీ గెలుపును భుజాలకెత్తుకొని
డప్పుల మోతల దరువులతో ఊరేగుతుంటే.....
రంగుల రాట్నలెక్కి రాజకీయం చేయండిమీరు...!!
- తాళ్లపల్లి యాకమ్మ