Sat 05 Jun 20:30:47.651756 2021
Authorization
మనుషుల శక్తితోనే దూరాలను గెలుచుకునే మొదటి ఆధునిక వాహనం సైకిలు. జూన్ మూడు ప్రపంచ సైకిలు దినోత్సవాన్ని జరుపుకోవాలని 2018లోనే యు.ఎన్.వో ప్రకటించింది. సైకిలు గురించిన జ్ఞాపకాలన్నీ చిన్ననాటి కాలంలోకి తీసుకుపోతాయి. సైకిల్ అనేది ఒక కాలానికి గుర్తు. అంటే ఆనాటి కాలంతో సైకిలుతో మనుషులకు గల సంబంధాలు ఆనాటి మనుషుల అనుంబంధాలు కూడా జ్ఞాపకాల్లోకి వస్తాయి.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనిషి రవాణాకు, స్వంత శక్తితో నడిచే వాహనాన్ని జర్మన్ 1817లో కనుగొన్నారు. సైకిలు అనే పేరును ఫ్రాన్స్‌లో 1860లో ఖరారు చేశారు. సైకిలు వాడకం అనేది ఆ రోజులలో డబ్బులున్న వాళ్ళకే సాధ్యమయ్యేది. కానీ తర్వాత్తర్వాత, చాలా తక్కువ ఖర్చుతో మనుషుల వాహనంగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ వాహనమైనా మనుషులకు హౌదానిచ్చేది గానే చూడబడుతోంది. సైకిలు తర్వాత స్కూటరు, మోటారు సైకిలు, ఇప్పుడు కారు స్థాయీ బేధాలతో వాహనాలుగా వున్నాయి.
కానీ సైకిలు అనేది సామాన్యులు కూడా కొనగలిగిన వాహనంగా మారటంతో, సామాన్యుల వాహనంగా దానికి పేరు పడిపోయింది. ఒక్కసారి కొనగలిగితే మన శారీరక శక్తినుపయోగించి ఎంత దూరాలైనా వెళ్ళి రావచ్చు. ఇప్పటి వాహనాలలా పెట్రోలు, డీజీలు ఖర్చులుండవు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ వాహనంగా కూడా సైకిలుకు పేరున్నది. చమురుతో నడిపే వాహనాలతోనే నేడు ప్రపంచం తీవ్ర మైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నది. వందల యేళ్ళుగా మానవ కోటికి కాల, దూరాలను జయిస్తున్న సాధనం సైకిలు.
నాకు తెలిసి మా నాన్న కొన్నది ర్యాలీ సైకిల్, మొట్టమొదట మా ఇంటి వాహనం అది. రోజూ పొద్దుటే సైకిల్ తుడవటమనేది నా పనిగానే వుండేది. దాన్నొక అపురూపంగా చూసుకొనేవాళ్ళం. రిమ్ములు మెరిసి పోయేట్లు తుడిచి దాని అందానికి మురిసిపోయేది. ఆ తర్వాత సైకిల్ అట్లాస్, ఈ అట్లాస్ సైకిల్ మీదనే ముందుగా నేను కాయించ్ తొక్కడం నేర్చుకున్నది. దూరాన్ని జయించడంలోని విజయగర్వం ఆనాడు అనుభవించాము. ఆ తర్వాత హెర్క్యులస్ సైకిలు, హీరో మొదలైనవెన్నో వచ్చాయి. అమ్మాయిలకు కూడా అనువైన సైకిళ్లు వచ్చాయి. హైస్కూల్, కాలేజీ అమ్మాయిలు సైకిలు తొక్కడమనేది అబ్బాయిలకు సమానంగా సమానతను సాధించిన దానికి గుర్తుగా వుండేది. సైకిలు షాపులలో గంటకు ఇంత అని సైకిళ్ళు అద్దెకు ఇచ్చేవారు. ఆ అద్దె సైకిళ్ళపైననే విద్యార్థి సంఘ కార్యకలాపాల కోసం చుట్టుపక్కల ఊర్లకు తిరిగి వచ్చే వాళ్ళము.
ఆనాడు సినిమాల హీరోలు, హీరోయినులు కూడా సైకిళ్ళనే వాడేవారు. 'సైకిల్ పై వన్నెలాడి పోతున్నది, రరుమని పిట్టలాగ పోతున్నదీ, నడుమంత వంచుకుని, నాజూకు పెంచుకోని రోడ్డంత నాదన్నది, అడ్డాలే లేవన్నది' అంటూ రాజబాబు పాడే పాట ప్రసిద్దమైనది. 1983లో సినిమా కథా నాయకుడు ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చి పార్టీ స్థాపించి ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిలే. సైకిల్ అనేది సామాన్యులకు చెందినదిగా వారి ప్రతీకగా ఉండటం వల్లనే దానిని ఎంపిక చేసుకున్నారు.
ఇక అమెరికన్ సామ్రాజ్యవాదం కమ్యూనిస్టు దేశమైన క్యూబా మీద అనేక ఆంక్షలు విధిస్తూ, ఆర్థిక నిర్బంధానికి దిగినపుడు, దేశాన్ని రక్షించుకోవటానికి అధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రో, పెట్రోలు వాహనాలకు బదులుగా దేశ ప్రజలందరినీ సైకిళ్ళు వాడమని కోరారు. అందుకనుగుణంగా ప్రజలు, ఉద్యోగులు అధ్యక్షుడితో సహా సైకిళ్ళు వాడి దేశాన్ని ఆర్థిక సంక్షోభాన్నుండి రక్షించుకున్నారు. సైకిలు సామాన్యుల గుర్తుగా ఉండటం వల్లనే అనేక మంది నాయకులు, ముఖ్యంగా వామపక్ష, కమ్యూనిస్టు నాయకులు సైకిలు యాత్రలు చేసి ప్రజల మంచిచెడ్డలను తెలుసుకోవడం చూశాము. ఆనాడు పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా వున్న పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా పార్లమెంటుకు సైకిలుపైనే వెళ్లేవారు. అది చూసి అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంటు ఆవరణలో సైకిలు స్టాండును ఏర్పాటు చేశారట. సైకిలు గుర్తు చేసుకోగానే దాని చుట్టూ వున్న చరిత్ర కళ్ళ ముందు తిరుగుతుంది.