Sat 26 Jun 21:26:28.160524 2021
Authorization
ప్రపంచంలో వాళ్ళెక్కడున్నా సరే వాళ్ళకు చేతులెత్తి మొక్కాల్సిందే. తెల్లని వస్త్రధారణే కాదు, హృదయాలూ స్వచ్ఛమైన తెలుపే. లేకుంటే తమ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని తెలిసినా, ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురై కనుమరుగై పోతామో అనే భయాలనూ వీడి, ధైర్యంగా రోగుల ప్రాణాలను కాపాడాలనే చొరవ, తెగువ ప్రదర్శించి ఆరోగ్య యుద్ధ క్షేత్రంలో ముందు నిలిచిన ధీరులు డాక్టర్లు. వారి సేవలు వెలకట్టలేనివి. ఎందరి కుటుంబాల్లోనో వెలుగు రేఖలు తొలిగి పోకుండా కాపాడారో, వారందరికీ జేజేలు.
ఆలిండియా మెడికల్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా చేసిన డా|| కె.కె.అగర్వాల్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ''నేను డా|| అగర్వాల్‌ను. పిక్షర్ అభీబాకీహై, మేరానామ్ జోకర్ సినిమాలో రాజ్‌కపూర్ చెప్పినట్లు రష్ట్రశీష ఎబర్ bవ స్త్రశీ శీఅ. కోవిడ్ నిమోనియాతో నేనూ బాధపడుతున్నాను. అయినా ఆక్సీజన్ పొందుతూనే కరోనా రోగులు తేరుకోవటానికి సూచనలిస్తూనే వుంటాను. నేను వైద్య రంగపు సామూహిక చైతన్యాన్ని కలిగి వున్నాను. నేనిపుడు కె.కె. అగర్వాల్‌ను కాను. ఒక వైద్య వృత్తికి ప్రతీకను'' అని మాట్లాడిన తర్వాత అదే కరోనాతో వారు ప్రాణాలు విడిచారు. ఎంతోస్ఫూర్తివంతమైన మాటలు నిత్యం చైతన్యాన్ని నింపుతూనే వుంటాయి. ఆయనొక్కడే కాదు, కుటుంబాలను, పిల్లల్ని విడిచి వైద్య సేవలో గడుపుతున్న డాక్టర్లు ఎందరో వున్నారు. ఆఖరికి గర్భవతులుగా వున్న మహిళా డాక్టర్లు పి.పి.యి. కిట్లు ధరించి, కరోనా వార్డుల్లో రోగులకు సేవ చేయటాన్ని మనం చూశాము. అలా చేస్తూ చేస్తూనే ప్రాణాలు వొదిలిన వారినీ చూశాము.
'అమ్మ సైతం నిస్సహాయంగా, కన్నీరవుతున్న వేళ, ఆ చేతులు తలలను నిమిరి, మీ ప్రాణాలకు నా ప్రాణమంటూ పుట్టెడు భరోసాను గుప్పిట పెడుతున్నవి. మనుషులు దు:ఖపు చితిలో, చివరి చరణాలను స్వరిస్తున్న సమయాన, ఆ రెండు హస్తాల స్టెతస్కోపెన్ కొత్త పాటకు ఆశల లయను రచిస్తోంది. నా దేశం వాళ్ళ పహారాలో శ్వాస పోసుకుంటోంది' అని అన్న కవి మాటలు అక్షర సత్యాలు. కుల, మత, ప్రాంత దురభిమానాలకతీతంగా వృత్తికి మరింత గౌరవాన్ని తెచ్చిన సందర్భమిది.
దేశ వ్యాపితంగా వందల మంది డాక్టర్లు మొదటి వేవ్ రెండవ వేవ్ కరోనాకు తమ ప్రాణాలను బలిచ్చారు. కనీసం డాక్టర్లకు పి.పి.యి. కిట్లు సరిపోను అందించే స్థితిలో కూడా మన దేశం లేకపోవడం విషాదకరం. ఈ దేశంలో పెద్ద నగరాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, క్రికెట్ స్టేడియాలు, గొప్ప గొప్ప మందిరాలు, ఘనమైన రాజకీయ వ్యవస్తా వున్నాయి గానీ, ప్రజలకు కావలసినన్ని వైద్యశాలలే లేవు. వున్న వాటిలోనూ డాక్టర్ల సంఖ్యా అత్యల్పమే. ప్రభుత్వ వైద్యశాలలోనూ వైద్యుల నియామకాలు లేక వేల మందికి ఒక్క డాక్టరు శ్రమించాల్సి రావడం పాలకుల దృష్టి లోపాలకు నిదర్శనం. వైద్యం చేసే డాక్టర్లకు సైతం ఆక్సీజన్ అందక పడిగాపులతో నానాయాతన పడటం దేశ వైద్య పరిస్థితిని సూచిస్తోంది.
డాక్టర్ల దినోత్సవ సందర్భంగా వారికి జేజేలు పలుకుతున్నాము కానీ డాక్టర్లపై దాడులు కూడా పెరుగుతున్నవి. ముఖ్యంగా ప్రవేటు ఆసుపత్రుల్లో అవినీతికి పాల్పడుతున్నారని, అధిక ధనం గుంజుతన్నారని, శవాలతోనూ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ దాడులు చేస్తున్నారు. కానీ ప్రవేటు వైద్యం పెట్టుబడి దారులు చేతుల్లోకి పోయింది. వైద్యం కూడా కార్పొరేటు పరమైపోయింది. దానికి లాభాలు తప్ప మరేమీ ముఖ్యం కాదు. అందులో పని చేస్తున్న వారిగానే ఉద్యోగులుగానే డాక్టర్లున్నారు చాలా వరకు. ఇప్పటికయినా వైద్యరంగాన్ని ప్రభుత్వం చేపట్టి, పటిష్టమైన వ్యవస్తగా రూపొందించాలి. ఇప్పటికీ ప్రభుత్వ వైద్య రంగమే ప్రజలకు బాధ్యత వహించింది. ప్రజల కోసం పని చేస్తున్న వైద్యులకు, ప్రజా వైద్యులుగా, ఉన్నత భావాలతో సేవ చేసిన వారికి మనందరమూ రుణపడి వుంటాము.