Sun 04 Jul 06:20:24.569431 2021
Authorization
'ఎవడు బ్రతికెడు మూడు యాభైలు!' అని కవిగారు అన్నారు గానీ బతకడమంటే, వారిచ్చిన చైతన్యం వందలేండ్లూ కొనసాగితే దాన్నే అమరత్వం అంటాం. బుద్ధుడు ఇప్పుడు భౌతికంగా లేడు కానీ ఇన్ని వందల యేండ్ల తర్వాత కూడా ఆయన చెప్పిన మాటల్ని, చూపిన మార్గాలను స్మరిస్తూనే స్ఫూర్తిని పొందుతున్నామంటే ఆయన బతికి వున్నట్టే కదా! మనుషులు జ్ఞాపకాల్లో బతికి వుండటానికి వాళ్ళు మహా కార్యాలు ఏవో చేసి వుండాలి. ప్రాణాలను వాటి కోసం వెచ్చించి వుండాలి. వారే నిత్యం స్మరణలో కూడా చైతన్యాన్ని నింపుతారు.
అట్లా తెలుగు నేలపైన చైతన్య రూపాలుగా నిలిచిన వారు అల్లూరి సీతారామరాజు ఒకరైతే, రెండో వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఈ ఇద్దరినీ ఈ మాసంలో స్మరించుకోవాలి. ఒకరిది జయంతి. మరొకరిది వర్థంతి. ఇద్దరికి ఓ సామ్యముంది. అధిపతుల కర్కశ తూటాలకు బలైన వారే ఇద్దరూ. సామాన్య ప్రజల పక్షాన వీరోచిత పోరాటంలో అసువులు బాసిన వారే. అందుకే వారు అమరజీవులు. చైతన్య ప్రతీకలు.
అల్లూరి సీతారామరాజు, ఆనాడు బ్రిటీష్ వారు ఆదీవాసీలపై సాగిస్తున్న అణచివేతపై, అటవి సంపదను కొల్లగొట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పోరాడిన యోధుడుగా ప్రసిద్ధుడు. గోదావరి నదీలోయ ప్రాంతాలలో అడవిలో జీవనం సాగిస్తున్న గిరిజనులను దోపిడీ చేస్తూ, తీవ్ర నిర్బంధాలకు బ్రిటీష్ వారు గురి చేశారు. మన్యం ప్రజలకు అండగా నిలబడి వారిని ఐక్యం చేసి, మా భూమి, మా నేల, మీకెక్కడిది అధికారమని నినదించి స్వాతంత్య్ర పోరాటానికి ప్రజలను సాయుధులను చేసిన సాహసి అల్లూరి. బ్రిటీష్ నిరంకుశత్వానికి ముచ్చెమటలు పట్టించిన ఉద్యమకారుడు అల్లూరి. ప్రజలు ఐక్యంగా చైతన్యయుతంగా ఉద్యమిస్తే ఎంతటి పాలకులైనా వణికిపోక తప్పదని రుజువు చేయించిన ఘనుడు. బ్రిటీష్ వారి మందబలం ఆధునిక ఆయుధాలతో ఓటమి చెందవచ్చు గాక, అల్లూరి ప్రాణాలొడ్డి రగిల్చిన స్వాతంత్య్ర జ్వాల అనేక ప్రాంతాల ఉద్యమాలకు స్ఫూర్తిని నింపింది. ఇప్పటికీ చైతన్యయుతమైన స్మరణకు ఆయన జీవితం నిలుస్తూనే వుంది.
అదే విధంగా దొడ్డి కొమరయ్య ప్రాణాలు, మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి శక్తిని నింపింది. సమరోజ్వల గీతాలాపన చేసింది. తెలంగాణా ప్రాంతంలో నైజాము నిరంకుశ పరిపాలనలో భూస్వాములు, జమీందారుల ఆగడాలకు అణచివేతలకు, దోపిడీకి వ్యతిరేకంగా 'సంగం' ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో 'నీ బాంచన్ కాల్మొక్త' అన్న సామాన్యులు 'నీ గోరీ కడతం కొడుకో' అని ఎదురు తిరిగి ఉద్యమించారు. ఎదురు తిరగటాన్ని సహించలేని జమీందారులు ప్రజలపై పైశాచిక దాడులకు పాల్పడ్డారు. వారి కాల్పుల కారణంగానే ఉద్యమంలో మొట్టమొదట తన ప్రాణాలను కోల్పోయిన వాడు దొడ్డి కొమురయ్య. ఆయన అమరత్వం ఎంతో మందిని ఐక్యం చేసి చైతన్యాన్ని పురికొల్పింది.
తెలంగాణా నేల వీరగడ్డగా పేరు పొందటానికి ఇలాంటి యోధుల వీరోచిత పోరాటం, ప్రాణ త్యాగం కారణాలు. ఆ రకమైన ధిక్కార స్వరాన్ని వినిపించే వారసత్వం నేటికీ కొనసాగుతూనే వుంది. ఇప్పుడూ దోపిడీ అణచివేతా వుంది. కొన్ని రూపాలు మారవచ్చుగాక, నిర్బంధాలూ వున్నాయి. నేడు గిరిజనుల జీవన సంస్కృతిలో భాగమైన పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటూ అడవి బిడ్డలపై నిర్బంధం సాగుతోంది. రైతుల పొట్టకొట్టే మూడు నల్ల చట్టాలతో అధికారం విరుచుకు పడుతున్న ఈ సందర్భంలో అల్లూరి సీతారామరాజు, దొడ్డి కొమురయ్యల జ్ఞాపకాలు మనలో పోరాట చైతన్యాన్ని నింపుతాయి. సంఘటిత సమరానికి పురికొల్పుతాయి.